వలపుల వల విసిరి కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుని.. ఆ తర్వాత ఫోన్ నంబర్ తీసుకుని నగ్న వీడియో కాల్స్ చేసి యువకుల జీవితాలను చిత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులు మరీ ఎక్కువయ్యాయి.
ఒకే ఒక్క వీడియో కాల్ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, డేటింగ్ యాప్స్ వంటి మాధ్యమాలే వారి అస్త్రాలు. ప్రొఫైల్ లో అందమైన అమ్మాయి ఫోటో పెడతారు. మంచి ఉద్యోగం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక వారి అసలు గేమ్ మొదలుపెడతారు. ఫ్రెండ్ నంటూ చాటింగ్ చేస్తారు. అర్ధరాత్రి సమయంలో వాట్సాప్ ఫోన్ కాల్ చేసి గంటల తరబడి మాట్లాడతారు. అవతల కుర్రాడు వారి బుట్టలో పడినట్టు నిర్ధారణ చేసుకుని అసలు రంగుని బయటపెడతారు. వాట్సాప్ లో నగ్న వీడియో కాల్ చేసి.. అవతల వ్యక్తి చూస్తున్నట్టు స్క్రీన్ రికార్డ్ చేస్తారు. ఈ వీడియోని సోషల్ మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. రూ. 20 వేల నుంచి మొదలుపెట్టి లక్షల్లో లాగడానికి ప్రయత్నిస్తారు.
కొంతమంది అమ్మాయిలు నేరుగా వాట్సాప్ వీడియో కాల్ చేసి దుస్తులు విప్పమని అంటారు. సల్మాన్ ఖాన్ బాదీలా ఫీలైపోయి విప్పితే ఇక అంతే సంగతులు. అవతల అమ్మాయి ఆ వ్యక్తి నగ్న శరీరాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని బెదిరించడం మొదలుపెడుతుంది. ఇలా చాలా మంది మగవారు అమ్మాయిల ఉచ్చులో పడి మోసపోతున్నారు. ఫోన్ ఎత్తేవరకూ వీడియో కాల్స్ చేస్తూనే ఉంటారు. పొరపాటున ఎత్తితే అవతల అమ్మాయి నగ్నంగా దర్శనమిస్తుంది. ఆ అమ్మాయి వీడియోతో పాటు ఆ అమ్మాయిని చూస్తున్నట్టు మగవారి ముఖం రికార్డ్ అవుతుంది. పరువు గలవారు కాబట్టి ఆ వీడియోని ఎక్కడా అప్లోడ్ చేయవద్దని అంటారు. దాని కోసం ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతారు. వేలు, లక్షలు సమర్పించుకుంటారు. ఇలా వారు డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉంటారు.
మరి కొంతమంది అయితే వీడియో కాల్ చేసి మీ ముఖాలను రికార్డ్ చేసి.. మీరు నగ్న వీడియోలు చూస్తున్నట్టు మార్ఫింగ్ చేస్తారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు. లొంగకపోతే సామాజిక మాధ్యమాల్లో నగ్న వీడియోలను అప్లోడ్ చేస్తారు. అప్పటికీ లొంగకపోతే మీ ఫోన్ లో ఉన్న మహిళా నంబర్లకు ఆ వీడియోలను పంపుతారు. మహా నగరాల్లో ఇలాంటి కేసులు ఎక్కువైపోయాయి. ఒక యువకుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన యువతితో చాటింగ్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఫోన్ నంబర్ ఇచ్చాడు. కొన్ని రోజులకు ఆ యువకుడి వాట్సాప్ నంబర్ కు నగ్న వీడియో కాల్ వచ్చింది. కాల్ రాగానే క్యాజువల్ గా చూసాడు. వెంటనే ఆ యువకుడి ముఖాన్ని రికార్డ్ చేశారు. ఆ వీడియో బయటపెట్టకూడదంటే రూ. 2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే వీడియోని ఫేస్ బుక్ లో స్నేహితులకు, బంధువులకు పంపిస్తామని బెదిరించారు.
దీంతో ఆ యువకుడు భయపడి మొదట రూ. 50 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత రూ. లక్ష ఇచ్చాడు. ఇస్తున్నాడు కదా అని అటు గ్యాంగ్ యువకుడ్ని ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక తన వల్ల కాదని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు యువకుడికి ధైర్యం చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే వలపు వల విసిరి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరస్తుల సంఖ్య బాగా పెరుగుతుందని పోలీసులు తెలిపారు. 60 నుంచి 70 రోజుల వ్యవధిలో 3 కమిషనరేట్ల పరిధిలో వందకు పైగా ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకూడదని.. తెలియని వారితో ఆన్ లైన్ లో స్నేహం చేయడం కూడా మంచిది కాదని పోలీసులు అంటున్నారు. మరి అమ్మాయిలను అడ్డుపెట్టుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.