గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి పెరగనున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని దీని కారణంగానే బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆదివారం రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఎండీతోపాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అయితే ఇదే అంశంపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు పెంచబోయే ఛార్జీల్లో ఆర్డినరీకి కి.మీ.కు 25 పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్ కి.మీ.కు 30 పైసలు పెంచనున్నారట. ఛార్జీలు గనుక పెంచితే లాంగ్ రూట్ లో పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో మరోసారి బస్సు ఛార్జీలు పెంచుతారేమోనని ప్రయాణికులు షాక్ కు గురవుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజీల్ ధరలు మండిపోతుండటంతో సామాన్యులకు భారంగా మారింది. దీంతో పాటు బస్సు ప్రయాణికుల ఆకర్షించేందుకు ఎండీ సజ్జనార్ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బస్సు ఛార్జీలు చివరిసారిగా 2019లో పెంచారు.