తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సర్కార్ శుభవార్తలు చెప్పింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు సంక్షేమ పథకాలు, సొంత ఇళ్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ అంటూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సర్కార్ శుభవార్తలు చెప్పింది. గురువారంనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు ఎన్నో శుభవార్లతు చెప్పారు. రెండో విడత దళిత బంధు, మూడో విడత గొర్రెల పంపిణీ, సొంత ఇంటి నిర్మాణం వంటి ఎన్నో విషయాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 58, 59 జీవోల కింద మరోసారి దరఖాస్తు చేసుకునే అంశం గురించి కూడా కేబినెట్ లో చర్చించారు. గవర్నర్ కోటాలో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు కేటాయించడంపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చేనెల 14న అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే తెలంగాణ సచివాలయాన్ని కూడా అదే రోజున ప్రారంభించనున్నారు. అలాగే ప్రజలకు నిర్వహిస్తున్న ఎన్నో సంక్షేమ పథకాల పంపిణీకి సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. గొర్రెల పంపిణీకి సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెండో విడత దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పోడు భూములకు పట్టాల పంపిణీ, సొంత ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద ఆర్థికసాయం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “గృహలక్ష్మి పథకం” కింద ఇంటి నిర్మాణం చేసుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు. మొత్తం 3 విడతల్లో ఈ మొత్తాన్ని అందిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల ఇళ్ల చొప్పున 4 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించుకున్న ఇళ్లకు సబంధించిన అప్పులను రద్దు చేస్తున్నామన్నారు. 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నుంచి గొర్రెల పంపిణీ కూడా ప్రారంభించి ఆగస్టునాటికి పూర్తి చేస్తామన్నారు. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.4,463 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
అంతేకాకుండా ప్రభుత్వం స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీవో 58, 59 కింద దరఖాస్తు చేసుకుంటే పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో 2014 కటాఫ్ ఇయర్ గా ఉండగా.. దానిని 2020కి పెంచారు. దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు కూడా ప్రకటించారు. రెండో విడత దళిత బంధు గురించి కూడా మంత్రి హరీశ్ రావు ప్రకటన చేశారు. ఏటా ఆగస్టు 26న దళితబంధు వేడుకలు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో అర్హులైన అందరికీ దళిత బంధు అందినట్లు తెలిపారు. మిగిలిన 118 నియోజకవర్గాల్లో కూడా 1100 మంది చొప్పున రెండో విడతలో దళిత బంధు అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాశీ, శబరిమలలో వసతి గృహాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నుంచి కాశీయాత్ర, శబరిమల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం వసతి సముదాయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాశీలో రూ.25 కోట్లు, శబరిమలలో రూ.25 కోట్లు కేటాయించి రాష్ట్రం నుంచే వెళ్లే భక్తుల కోసం వసతి సముదాయాలు నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.