రానున్న రోజుల్లో నగరంలో మెట్రో ప్రయాణమే కీలకం కానుందా..! నగరం నలువైపులా మెట్రో ప్రయాణాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తేనుందా..! అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మెట్రో మార్గాలను పొడిగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గాన్ని మరో 15 కి.మీ దూరంలో ఉన్న తుక్కుగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు పొడిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త అందుతోంది. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ పరిధి నలువైపులా విస్తరించేందుకు అవకాశం ఉండడంతో ప్రభుత్వ పరంగా మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లైన్‌కు పొడిగింపుగా.. శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు వెంబడి తుక్కుగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టే అధ్యయనం చేయనున్నారు. అదే జరిగితే.. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు మెట్రో ప్రయాణం సాగించవచ్చు.
నగరానికి వెస్ట్ జోన్లో ఉన్నటువంటి ఐటీ కారిడార్‌లో అభివృద్ధి జరిగినట్లే, సౌత్ జోన్‌గా ఉన్న శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం, ఆదిభట్ల ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకుకెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ ఆలోచన వాస్తవ రూపం దాల్చితే.. ప్రజా రవాణా వ్యవస్థను కోర్ సిటీ నుంచి అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది. అందులోనూ ఓఆర్ఆర్ పరిధిలో మెట్రో మార్గం కోసం కావలసిన స్థలం అందుబాటులో ఉంది. దీంతో తక్కువ వ్యయంతోనే అందుబాటులోకి తీసుకురావచ్చు. ప్రస్తుతం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మిస్తుండగా.. అక్కడి నుంచి తుక్కుగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు 15 కి.మీ దూరం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు వ్యయంపైనా తలమునకలై ఉన్నారు.
రానున్న రోజుల్లో మెట్రో ప్రయాణాన్ని గ్రేటర్ వ్యాప్తంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందట. ఓఆర్ఆర్ పరిధిలో 4 చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన రకరకాల ఉత్పత్తుల తయారీకి పారిశ్రామిక కారిడార్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గాన్ని మరో 15 కి.మీ దూరంలో ఉన్న తుక్కుగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు పొడిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏదేమైనా.. నగర వాసులుకు రానున్న రోజుల్లో ప్రయాణం సులభతరం కానుంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.