జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు.
జాతీయ రహదారిపై ఎక్కువగా వాహనాలు ప్రమాదానికి గురవుతుంటాయి. వేగంగా ప్రయాణించడం వల్ల అదుపు తప్పుతుంటాయి. ఎక్కువగా ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతుంటాయి. వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి ప్రమాదానికి గురవుతాయి. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం పెర్కిట్ గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. 38 మంది ప్రయాణికులతో రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొంది. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలవ్వగా, మరికొందరికి స్పల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్ లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ సురేష్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిద్ర మత్తులో కళ్ళు మూతలు పడడంతోనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద జాతీయ రహదారిపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న కారు టైర్ పేలిపోవడంతో.. కారు అదుపుతప్పి గాల్లో పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.