పని అంటే దైవంతో సమానం. విధుల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన పనులే తప్ప వేరే పనులు చేయకూడదు. అలాంటిది డ్యూటీ పక్కన పెట్టి మద్యం తాగడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడంటే ఎన్ని వేషాలు వేసినా ఇప్పట్లా సోషల్ మీడియాలు గట్రా లేవు కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఆ విషయం మర్చిపోయిన ఇద్దరు పోలీసులు డ్యూటీని గాలికి వదిలేసి నడిరోడ్డు మీద ఫుట్ పాత్ పై కూర్చుని మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ లోని పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయాల్సిన తెలంగాణ పోలీసులు.. డ్యూటీ పక్కన పెట్టేసి.. ఫుట్ పాత్ పై కూర్చుని తీరిగ్గా మద్యం సేవిస్తున్నారు. ఒంటి ఖాకీ యూనిఫాం ఉండగా మద్యం సేవించడం మొదలుపెట్టారు. ఈ పని కనబడకుండా ఉండడం కోసం పోలీస్ వాహనాన్ని అడ్డుపెట్టుకున్నారు. మందు బాటిల్లు, మంచింగ్ ప్లేట్ కనబడకుండా ఫుట్ పాత్ కి అవతల వైపు దాచారు. ఎర్రమంజిల్ గలేరియా మాల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ మొత్తం వ్యవహారం కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియో కాస్తా వైరల్ గా మారడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది. రాత్రి పూట గస్తీ కాయాల్సిన పోలీసులు ఇలా డ్యూటీలో ఉండగా మద్యం సేవించడంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ తప్పు చేస్తే నిలదీయాల్సిన పోలీసులే తప్పు చేస్తే ఎలా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.