ఎన్నికల కమీషన్ ఎంత చైతన్య పరుస్తున్న మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం!. ఆపై సామాజికంగా విభజించి ఓట్లను కొనేయడమే అన్న చందంగా మారాయి. కఠినమైన చట్టాలు వున్నా శిక్ష పడట్లేదు అనేది సగటు ఓటరు ఆవేదన. ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు చేసింది కోర్టు – 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వెంకటేశ్వర్లును దోషిగా నిర్ధారించింది.
ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. ఆ ఎన్నికల్లో గద్దల నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా పాయం వెంకటేశ్వర్లు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదైంది. నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆయనతోపాటు పాయంపైనా కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు ఇద్దరికీ జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధించింది.
జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు పాయం వెంకటేశ్వర్లు కోర్టును కోరారు. న్యాయస్థానం జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు జైలు శిక్షను ప్రజా ప్రతినిధుల కోర్టు నిలిపివేసింది. గతంలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టివేసిందన్న తెలిసిందే.