జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని భావించి.. ఓ ధ్రుడ సంకల్పంతో ముందుకు వెళ్లేవారిని ఎలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టలేవు. మొక్కవోని వారి ధైర్యం, సంకల్ప బలం ముందు విధి సైతం తలవంచుతుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎందరో నిరూపించారు. తాజాగా ఈ జాబితాలోకి మరో తెలుగు విద్యార్థిని చేరింది. సామాన్యంగా పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏం చేస్తారు.. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వీడియోలు, రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏం ఉండదు.. పైగా టైం వేస్ట్. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అయ్యే వారు.. ఇలా మొబైల్‌లో టైంపాస్ చేస్తారు. ఆ తర్వాత బాధపడతారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విద్యార్థిని.. వీరందరికి భిన్నం.
ఆ విద్యార్థిని పేరు హారిక. స్వస్థలం నిజామాబాద్ జిల్లా.. నాందేవ్వాడ. ఇక హారిక తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు. తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని.. బీడీ కార్మికురాలిగా పని చేస్తూ.. తమ కోసం కష్టపడుతుంది. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన హారిక.. అమ్మ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకోవాలని భావించి.. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేది. అయితే డాక్టర్ కావాలన్నది ఆ విద్యార్థిని కల. అదెంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో తనకు కూడా తెలుసు. ముందైతే బాగా చదువుకుని మంచి నీట్‌లో మంచి ర్యాంకు సాధించాలని నిశ్చయించుకుంది. ఇక నీట్‌లో ర్యాంక్ సాధించడం అంటే అంత చిన్న విషయం ఏం కాదు. లక్షలు ఖర్చు పెట్టి.. ఏళ్ల పాటు శ్రద్దగా చదివినా ర్యాంకు వస్తుందా అంటే డౌటే. అలాంటిది హారిక ఏలాంటి కోచింగ్ లేకుండా.. నీట్‌లో ఏకంగా రాష్ట్ర స్థాయిలో 700వ ర్యాంకు సాధించింది.
మరి హారిక నీట్‌కు ఎలా ప్రిపేరయ్యిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. యూట్యూబ్‌లో నీట్ కోచింగ్ వీడియోలు చూసి.. పరీక్షకు సిద్ధమైంది హారిక. ఒక్కసారి ఆ అమ్మాయి స్థానంలో ఓ సగటు విద్యార్థిని ఊహించుకోండి. తల్లిదండ్రులు కోచింగ్ కోసం లక్షలు ఖర్చుపెట్టి.. అడిగిన బుక్స్ వెంటనే తెచ్చిచ్చి.. ప్రత్యేక రూం… చదువుకు ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు కల్పించినా సరే.. పరీక్షల్లో క్వాలిఫై కాని వారు ఎందరో. అలాంటి విద్యార్థులంతా హారికను చూసి స్ఫూర్తి పొందాలి. కోచింగ్ వెళ్లకుండా.. కేవలం యూట్యూబ్ క్లాస్‌లు విని.. నీట్‌లో ఆలిండియా స్థాయిలో 40 వేల ర్యాంకు.. రాష్ట్రస్థాయిలో 700 ర్యాంకు సాధించిందంటే.. ఆమె పట్టుదల, ఏకాగ్రత ఎంత గొప్పగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక బిడ్డ సాధించిన విజయం చూసి ఆ తల్లి గర్వంతో పొంగి పోయింది. తినడానికే సరిగా తిండి లేని స్థితిలో.. బిడ్డ తన పరిస్థితి అర్ధం చేసుకుని.. సొంతంగా కష్టపడి చదివి.. ఇంత మంచి ర్యాంకు పొందినందుకు పొంగిపోతుంది. తన బిడ్డ పదో తరగతి, ఇంటర్‌లో కూడా మంచి మార్కులు సాధించిందని తెలిపింది. ఇక హారిక సాధించిన ర్యాంకుకు ఆమెకు సిద్ధిపేట మెడికల్ కాలేజీలో సీటు లభిస్తుంది. అయితే నీట్‌లో మంచి ర్యాంకు వచ్చినా.. ఆ తర్వాత ఖర్చులు హారకకు పెను భారంగా మారాయి.
హాస్టల్ ఫీజు, బుక్స్, ఇతరాత్ర అన్ని కలిపి.. రెండు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తాన్ని భరించే స్థితిలో ఆ కుటుంబం లేదు. దాంతో తాను చదువుకు దూరమవుతానేమోనని హారిక ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే మీడియా కథనాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించారు. తన నిజామాబాద్ పర్యటనలో హారికను కలిసి.. ఆమె ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని ఈ సందర్భంగా కవిత హామీ ఇచ్చారు. అంతేకాక మొదటి మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో అందించారు.
ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ.. ‘‘ఏడో తరగతిలో ఓ టీచర్ చెప్పిన మాటలు నాపై బాగా ప్రభావం చూపాయి. అందుకే డాక్టర్ కావాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకోసం ఎంతో శ్రమించాను. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయలేదు. ఇక వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత.. డాక్టర్‌గా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే నా లక్ష్యం’’ అంటుంది. దాతలు హారికను ఆదుకుంటే బాగుంటుంది అంటున్నారు స్థానికులు. మితిమీరిన స్వేచ్ఛ.. అడగ్గానే అన్ని అమర్చే తల్లిదండ్రులు ఉండి కూడా తప్పుదోవ పడుతున్న విద్యార్థులు హారికను చూసి నేర్చుకోవాలి అంటున్నారు. నేటి తరం విద్యార్థులకు హారిక ఆదర్శం అని కామెంట్స్ చేస్తున్నారు.
Dare to dream and then never stop working until you achieve them.
This is the story of Harika,who passed and excelled in the MBBS exams via YouTube videos. I met her and her mother and extended my support towards her dreams by handing over the first installment of her fees
(1/2) pic.twitter.com/8NIUqSk91e— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 9, 2022