డబ్బు.. మనిషి ప్రయాణం మొత్తం దీని చుట్టూనే తిరుగుతోంది. చేతిలో రూపాయి లేకపోతే.. పలకరించే మనిషి కూడా ఉండడు. ఏదో బాగున్నావా అంటారా! కానీ, ఆప్యాయత, అనుబంధం ఎక్కడా కనబడవు. ఇలాంటి రోజుల్లో అడిగిన దాని కంటే.. ఐదు రెట్లు ఎక్కువ డబ్బు వస్తోందంటే జనాలు ఊరుకుంటారా! ఆ.. ఆ.. తండోపతండాలుగా ఎగబడ్డారు. పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి రూ. 500 తీసుకుందామని ఎటిఎంకు వెళ్తే, రూ.2500 వచ్చాయి. అంతే.. ఆ ఏటీఎంకు వందలాదిగా జనం క్యూ కట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్, మొగల్పురాలోని ఇశ్రత్ మహల్ లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి.. లోపలికి వెళ్లి రూ.500 డ్రా చేయగా.. రూ.2500 విత్‌డ్రా అయ్యాయి. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పాకడంతో డబ్బులు డ్రా చేసేందుకు జనాలు పోటీపడ్డారు. అప్పటికే కొందరు డ్రా చేసుకొని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ శివకుమార్ ఏటీఎం కేంద్రానికి చేరుకుని పరీక్షించగా రూ.500 డ్రా చేస్తే రూ.2500 వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఏటీఎం కేంద్రాన్ని మూసి వేయించి, బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. సాంకేతిక కారణాలతోనే ఇలా వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఘటనపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.