నేటికాలంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ఎక్కడ చూసిన ఉద్యోగం కోసం నిరీక్షించే వారే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇక ఏదైన మంచి జాబ్ వస్తుందంటే డబ్బులు ఇచ్చేందుకు కూడా కొందరు వెనకాడటం లేదు. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగం, ప్రభుత్వ జాబ్ కోసం లక్షల్లో డబ్బులు కుమ్మరిస్తుంటారు. లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలను డబ్బులతో సొంతం చేసుకుంటారు. లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాల కోసం భారీగా డబ్బులను ఖర్చు పెట్టి దక్కించుకునే వారు ఓ వైపు ఉంటే.. కూలీ పని కోసం రూ.60 లక్షలు ఘటన మరోవైపు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఐఎంఎఫ్ఎల్ మద్యం డిపోలో హమాలీ పోస్టుకు కోసం ఈ పెద్ద మొత్తం ఇచ్చుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి..
తెలంగాణలోని మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ శివారులో స్వదేశీ మద్యం(ఐఎంఎల్)డిపోలో ఈ వ్యవహారం షాక్కు గురి చేస్తోంది. స్థానికంగా ఉన్న ఈ డిపోలో హమాలీ పోస్టుకు హమాలీ మజ్దూర్ యూనియన్ వేలం పాట నిర్వహించింది. ఈ వేలం పాటలో చాలామంది పాల్గొనగా… ఎంతో ఆసక్తిగా ఇది జరిగింది. ఇటీవల చిన్నఘనపూర్ డిపోలో పనిచేసే నాగం సతీష్ అనే వ్యక్తి మరణించాడు. దీంతో అతడి పోస్టులో వేరే వారిని భర్తీ చేసేందుకు ఈ వేలం పాట నిర్వహించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈక్రమంలో వేలం పాట నిర్వహించారు. ఇందులో చిన్నఘనపూర్కు చెందిన ఓ వ్యక్తి రూ.60.10 లక్షలకు హమాలీ ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. గతంలో ఇదే డిపోలో హమాలీ పోస్టు రూ.20 నుంచి రూ.39 లక్షలు పలికిందని స్థానికులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా రూ.60 లక్షలు పలికిందని, ఇంత పెద్ద మొత్తంలో పలకడం ఇదే మొదటి సారని స్ధానికులు చెబుతున్నారు.
ఈ డిపోలో పనిచేసేవాళ్లు ఎవరైనా హామాలీ ఉద్యోగం వదిలేసి వెళ్లినా లేదా చనిపోయినా వారి స్థానంలో వేరే వారిని భర్తీ చేస్తారు. అంతర్గతంగా వేలం పాట ద్వారా హమాలీ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో స్థానికులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. డిపోలో మద్యం సీసాలున్న పెట్టెలను వాహనాల్లో ఎక్కించడం, దించడం హమాలీ పని. ఈ పనికి రోజువారీగా రూ.2,500 నుంచి రూ.3 వేలు కూలి వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.75 వేల నుంచి రూ.90 వేల వరకు వస్తాయి. ఇంత తక్కువ జీతం కోసం ఈ స్థాయి పోటీ పడటంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేలం విషయంపై డిపో మేనేజర్ నాగేశ్వరావును వివరణ కోరగా.. అది హామాలీల వ్యక్తిగత విషయమని, వేలం విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.