కామాంధుల కామవాంఛకు గుడి, బడి అని తేడా లేకుండా పోతోంది. ఎక్కడపడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఆందులోనూ తమ కోరిక తీర్చుకోవడానికి వయసును కూడా చూడట్లేరు. చిన్నారులను సైతం ఛిద్రం చేస్తున్నారు. వీరి బాధలు భరించలేక చిన్నారులు అర్ధాంతరంగా తనువుచాలిస్తున్నారు. పోనీ, శిక్షలు పడట్లేదా? అంటే.. కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తున్నా వీరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. శిక్షలు తమకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పవిత్రమైన బడిలోనే విద్యార్థినులపై కన్నేసి.. తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇది కూడా అలాంటి ఘటనే. సంగారెడ్డిలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు పాల్పడ్డాడు. రోజూ ఏదో ఒక సాకు చెప్పి విద్యార్థినిని రూంలోకి పిలిపించుకొని నరకం చూపెట్టేవాడట. తోటి విద్యార్థులు ఏమైంది? అని అడిగితే బాధిత విద్యార్థిని ఏదో ఒకటి చెప్పి కప్పిపుచ్చేదట. అయితే.. ఇటీవల ప్రిన్సిపాల్ వేధింపులు శృతిమించడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదువుతున్న విద్యార్థిని ఈనెల 11న హాస్టల్ రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా.. తీవ్రంగా గాయపడింది. దీంతో సదురు విద్యార్థినిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఏమైంది అని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాఠాలు చెప్పాల్సిన గురువులే.. ఇలాంటి దారుణాలకుకి ఒడిగడుతుండడంతో పిల్లలను బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ కీచక టీచర్ కు పడే శిక్షతో అయినా.. ఇలాంటి వారిలో మార్పు వస్తుందేమో చూడాలి.