తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికల విషయం గురించే చర్చ నడుస్తుంది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆయన రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. మునుగోడు ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మునుగోడు ఉన్నికల ప్రచారాలు హూరా హూరిగా సాగుతున్నాయి.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాక పుట్టిస్తున్నారు.
నిన్న మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ గడువు పూర్తయ్యింది.. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు నాయకులు క్యూ కట్టారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దర్ మునుగోడులో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆయన పోటీ నుండి తప్పుకోవడంతో కేఏ పాల్ రంగంలోకి దిగి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రజా గాయకుడు గద్దర్ తమ పార్టీలో చేరారని.. ఆయన పార్టీలో చేయడం మాకు ఎంతో బలాన్ని చేకూర్చిందని అన్నారు. మునుగోడులో ఈసారి తమ పార్టీ నుంచి గద్దర్ ని పోటీ చేయించాలని నిర్ణయించామని అన్నారు. కానీ ఆయన మునుగోడులో నామినేషన్ వేయకుండ కొంత మంది అధికార పార్టీ నేతలు భయబ్రాంతులకు గురి చేశారని.. అందుకే ఆయన అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారని ఆరోపించారు. ఆయన నామినేషన్ వేయకున్నా తన పాటతో ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తానని అన్నారు.
మునుగోడులో తాను నామినేషన్ వేయడానికి వచ్చినపుడు కొంత మంది అధికారులు తనను కావాలని అడ్డుకున్నారని.. ఎన్ని కుట్రలు పన్నినా తాను మాత్రం నామినేషన్ వేశానని అన్నారు. ఇప్పటి వరకు బడా పార్టీల నాయకులు మునుగోడుకు ఏమీ చేయలేదని.. వారి నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అభివృద్ది జరగలేదని అన్నారు. ఒక్కసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ గెలిస్తే.. మునుగోడు ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతామని.. అన్ని పార్టీలకు సరైన గుణపాఠం చెబుతామని అన్నారు.