తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీలో దారుణాలు బాగా పెరిగిపోయాయి. భాగ్యనగరంలో ఈమధ్య హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. భూతగాదాలు, ఆస్తి పంపకాలు, అక్రమ సంబంధాలు ఇలా కారణాలేవైనా ప్రాణాలు తీయడానికి మాత్రం జంకడం లేదు. ఇక తాజాగా సిటీలో ఇలాంటి మరో ఘటనే జనాలను ఉలిక్కిపడేలా చేసింది. మియాపూర్‌లోని బస్టాండ్‌లో పట్టపగలే దారుణ హత్య స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. బస్టాండ్‌లో ఉన్న ఓ వ్యక్తి మీద కొంతమంది దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి.. అక్కడికక్కడే మృతి చెందాడు.
మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కేఎస్ బేకర్స్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేశారని సమాచారం. ఈ విషయం గురించి సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరి, హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న ఇలాంటి దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.