ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఉమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ సారి మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..
ఆకాశలో సగం.. ఆమె లేకపోతే.. అసలు సృష్టే లేదే.. ఆమె చేయి కదలకపోతే.. ఈ సృష్టి ముందుకు సాగదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నడిచే యంత్రంలా ఆమె పరుగులు పెడుతూనే ఉంటుంది. పండగలు, పబ్బాలు, ఆదివారాలు.. ఇలా మనకు ఎన్నో సెలవులు.. కానీ ఆమెకు మాత్రం ఒక్క రోజు కాదు కదా.. ఒక్క పూట కూడా సెలవు లేదు. ఆమె కోసం ఆమె కేటాయించుకునే సమయం బహుశా అసలు ఉండదేమో. ఎంత సేపు కుటుంబం, బాధ్యతలు ఇవే ఆమె మదిలో మెదులుతుంటాయి. మరి ఆమె బాగుంటేనే సమాజం బాగుంటుంది. అలాంటి మహిళ.. కనీసం ఒక్క రోజు అయినా తన గురించి తాను సమయం కేటాయించుకోవాలని.. ఆమె శ్రమను గుర్తించడం కోసం అంతర్జాతీయ సమాజం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలని భావించింది. దీనిలో భాగంగా మార్చి 8న మహిళా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ఆ ఆలోచన నుంచి వచ్చిందే.. ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.
దీనిలో భాగంగా ప్రభుత్వాలు కూడా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ఉమెన్స్ డే సందర్భంగా సాధారణ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ఈ సెలవు వర్తిస్తుందని కేసీఆర్ సర్కార్ స్పష్టం చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ వర్తిస్తుందని.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం.. గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థలను ఆదేశించింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఆదివారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతి ఏటా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని మార్చి 8న తెలంగాణ రాష్ట్ర సర్కార్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తోంది. ఈ సారి కూడా అలాగే సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 8న హోలీ పండుగ వేళ విద్యాసంస్ధలకు సెలవు ప్రకటిస్తూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక అదే రోజున ఉమెన్స్ డే ఉండటంతో.. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది కేసీఆర్ సర్కార్
అలాగే మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన మహిళలను సన్మానించే కార్యక్రమం కూడా నిర్వహించనుంది ప్రభుత్వం. ప్రతి ఏటా ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన నారీమణులను ప్రభుత్వం సన్మానిస్తోంది. ఈ సారి కూడా ఆ కార్యక్రమం ఉండే అవకాశముంది. మరి ఉమెన్స్ డే రోజున మహిళలకు సెలవు ప్రకటిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.