ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రోజులో ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం, ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా దాదాపుగా బాధ్యత లేకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంక మెట్రోపాలిటన్ సిటీలు, పెద్ద నగరాలు అయితే ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు సిగ్నల్ జంప్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం చేస్తూనే ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎంత హెచ్చరించినా కూడా పట్టించుకోరు. మీ జాగ్రత్త కోసమే రూల్స్ పాటించమని చెబుతున్నాం అని నెత్తీనోరు మొత్తుకున్నా వినే పరిస్థితి కనిపించదు.
హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితినే చూస్తూ ఉంటాం. ట్రాఫిక్ పోలీసులు కూడా రూల్స్ అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పుడు రూల్స్ ని మరింత కఠినతరం చేసేందుకు పూనుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జరిమానాలను కూడా పెంచనున్నట్లు వెల్లడించారు. రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేస్తూ పట్టుబడితే ఇక నుంచి రూ.1700 జరిమానాగా వసూలు చేస్తామన్నారు. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ దొరికితే రూ.1200 ఫైన్ వేస్తామని తెలిపారు. గతమూడేళ్లలో ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ రైడింగ్ వల్ల 100 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మీ ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా.. ఎదుటివారిని కూడా కాపాడిన వారు అవుతారంటూ హితవు పలికారు.