హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుండం సాధారణమే. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, వీఐపీల రాకపోకలు, నాలాల నిర్మాణ పనుల సమయాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తుంటారు. ఇప్పుడు కూడా సిటీలోని కొన్ని రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిటీ నడిబొడ్డున కొత్త సెక్రటేరియట్‌కు దగ్గర్లో ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల పొడవుతో నిర్మిస్తున్న ఈ విగ్రహ ఆవిష్కరణకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ ఏర్పాట్ల క్రమంలో భాగంగా ట్యాంక్‌బండ్ పరిసర ఏరియాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కోసం ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్-నెక్లెస్ రోడ్డులో రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు.
ఎన్టీఆర్ మార్గ్-నెక్లెస్ రోడ్డులో రాకపోకలను నిలిపివేయడంతో రవీంద్రభారతి నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు సహకరించాలని, ఈ రూట్‌కు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న పలుచోట్ల ట్రాఫిక్‌ను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. కాగా, రెండెకరాలు విస్తీర్ణంలో అంబేడ్కర్ విగ్రహాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. ఇంత పెద్ద అంబేడ్కర్ విగ్రహం ఇప్పటివరకు దేశంలో ఎక్కడా నిర్మించలేదు. తెలంగాణకు మణిహారంగా నిలవనున్న ఈ విగ్రహం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగించారు.