”తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు ఈ లోకంలో” అన్న డైలాగ్ అక్షరాల సత్యమే. బిడ్డ అమ్మా.. ఆకలి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే.. బిడ్డ ఆకలి తీరుస్తుంది. కన్నపేగు కళ్ల ముందు సంతోషంగా ఉంటే చాలు.. ఆ తల్లికి కావాల్సింది ఏదీ లేదు ఈ లోకంలో. మరి అలాంటి తల్లులకు నేటి సమాజంలో బుక్కెడు బువ్వ కరువైంది. కనీ.. పెంచి.. ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకునే స్థితిలో లేరు కొందరు కొడుకులు. అలాంటి కొడుకులకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది న్యాయసేవాధికార సంస్థ. తాజాగా వృద్ధప్యంలో ఉన్న కన్న తల్లిని పట్టించుకోని కొడుకులకు మెుట్టికాయ వేసింది పురానీహవేలీలోని న్యాయసేవాధికార సంస్థ(DLSA).4 ఏళ్లు గా ఓ తల్లి చేస్తున్న పోరాటం తాజాగా విజయం సాధించింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో జరిగిన ఈ సంఘటన గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
60 సంవత్సరాలు ఉన్న ఓ వృద్ధురాలికి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో రూ. 5 కోట్ల విలువైన సొంత ఇల్లు ఉంది. భర్త నాలుగు సంవత్సరాల క్రితం చనిపోవడంతో ఒంటరిగా, మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఆమెకు అండగా ఉండాల్సిన కొడుకులు కనికరం లేకుండా ఇంట్లో నుంచి గెంటేశారు. దాంతో ఆ వృద్ధురాలు చేసేది ఏం లేక కొన్ని రోజులు వృద్ధాశ్రమంలో ఉంది. కొడుకులు చేరదీస్తారని చూసిన ఆమెకు నిరాశే ఎదురైంది. దాంతో తెలిసిన వారి సహాయంతో 2018 మే నెలలో ఆర్డీవోకు తన బాధను మెురపెట్టుకుంది. దాంతో కన్నతల్లి బాగోగులు చూసుకోవాలంటూ.. సదరు ఆర్డీవో.. ఆమె కొడుకులకు నోటీసులు జారీ చేశాడు. కానీ కొడుకులు వాటిని లెక్కచేయలేదు. దాంతో పురానీహవేలీలోని న్యాయసేవాధికార సంస్థ(DLSA)ను ఆశ్రయించింది.
ఈ క్రమంలో వాయిదాలకు హాజరైయ్యేందుకు ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో 15 కిలోమీటర్లు కాలినడకనే ఆమె వాయిదాలకు హాజరు అయ్యేది. ఈ హృదయ విదారకమైన సంఘటన చూసేవారిని సైతం కన్నీరు పెట్టుకునేలా చేసింది. వృద్ధురాలి అర్జీని విచారించిన సంస్థ.. కుమారులను పిలిచి, న్యాయపరంగా ఎదురైయ్యే సమస్యలను వివరించింది. అనంతరం ఆస్తిని మూడు భాగాలు చేసింది. రెండు భాగాలు కుమారులకు, మరో భాగం తల్లికి కేటాయించారు. మెుదటి, రెండో అంతస్తుల నుంచి వచ్చే అద్దెను ఆమెకు చెల్లించాలని న్యాయసేవాధికార సంస్థ ఆదేశించింది. 2023 జనవరి నుంచి ప్రతినెలా చెరో రూ.18 వేల చొప్పున ఆమె బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ఒప్పందం కుదిర్చింది. లేనిచో ఆమెకు ఇష్టం వచ్చిన వారికి ఇల్లును అద్దెకు ఇవ్వొచ్చని ఒప్పందంలో పేర్కొంది.