కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్ప పాటుదీ జీవితం అన్నాడు ఓ సినీ కవి. నేటి కాలంలో సంభవిస్తోన్న కొన్ని మరణాలు చూస్తే.. ఈ మాట నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు.. ఉన్నట్లుండి కుప్పకూలి.. మృత్యువాత పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
గుండెపోటు.. ఈ మాట వింటేనే ఒళ్లు జలదరిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు.. గుండెపోటు అంటే.. 50 ఏళ్ల పైబడిన వారికి.. అది కూడా కాస్త బరువు అధికంగా ఉన్న వారికి వచ్చే జబ్బు అన్న అభిప్రాయం ఉండేది. మరి ఇప్పుడో.. చిన్నా పెద్దా తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు గుండెపోటు బారిన పడుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ బారిన పడి క్షణాల్లో కన్ను మూస్తున్నారు. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న మరణాల్లో గుండెపోటు కారణంగా మృతి చెందిన వారే అధికంగా ఉన్నారు. నటుడు నందమూరి తారకరత్న, నిన్న పాత బస్తీలో వివాహానికి హాజరైన ఓ వ్యక్తి.. నేడు కిషన్ రెడ్డి మేనల్లుడు.. వీరంతా గుండెపోటు కారణంగా మృత్యువాత పడ్డవారే. కొన్ని రోజులు క్రితం ఇంటర్ చదువుతున్న అమ్మాయి.. గుండె పోటు కారణంగా స్కూల్లోనే కుప్ప కూలిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్‌లో మరో సంఘటన వెలుగు చూసింది. జిమ్‌లో వ్యాయామం చేస్తూ.. ఓ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
విశాల్ వయసు పట్టుమని పాతికేళ్లు కూడా ఉండదేమో. ఎంతో కష్టపడి చదివి.. ప్రభుత్వం ఉద్యోగం సాధించాడు. పోలీసు కొలువు అంటే ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం రోజు జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేసేవాడు. ప్రతి రోజు సికింద్రాబాద్‌లోని ఓ జిమ్‌కు వెళ్లేవాడు. దానిలో భాగంగా గురువారం కూడా జిమ్‌కు వెళ్లాడు విశాల్. పుషప్స్ చేసిన తర్వాత మరికొన్ని ఎక్సర్‌సైజ్‌లు చేస్తుండగా ఉన్నట్లుండి ఛాతిలో పట్టేసినట్లు అనిపించింది. వెంటనే అలా కూర్చుండిపోయాడు. సెకన్ల వ్యవధిలో కూర్చున్న చోటే కుప్పకూలాడు. జిమ్‌లో ఉన్న వారు విశాల్‌ను గమనించి.. వెంటనే పక్కనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విశాల్‌ను పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
— Hardin (@hardintessa143) February 24, 2023
అప్పటి వరకు తమతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపిన వ్యక్తి.. ఇలా ఉన్నట్లుండి మృత్యువాత పడటం జీర్ణించుకోలేకపోతున్నారు అతడి స్నేహితులు. విశాల్ లేడంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాం అంటున్నారు. ఇక విశాల్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్నాడు. ఇక విశాల్ కార్డియాక్ అరెస్ట్ బారిన పడ్డట్లు వైద్యులు భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలా కార్డియాక్ అటాక్ కారణంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 40 ఏళ్ల లోపు వారు కూడా ఇలా గుండెపోటు కారణంగా మృతి చెందుతుండటం కలవరపెడుతోంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందిన తొలి సెలబ్రిటీ శ్రీదేవి అని చెప్పవచ్చు. ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్, ఇక తాజాగా తారకరత్న ఇలా చాలా మంది సెలబ్రిటీలు చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృత్యువాత పడ్డారు.
ఇక నిత్యం వ్యాయామం చేసేవారిని కూడా గుండె పోటు వదలడం లేదు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. గుండెపోటు.. హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్.. కారణమేదైనా పట్టుమని పదేళ్లు లేని వారి నుంచి నాలుగు పదుల వయసులోపే చాలా మంది ఊపిరి ఆగిపోతుండటం ఆందోళణ కలిగిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.