డబ్బావాలా అనగానే అందరికీ తొలుత గుర్తొచ్చేది ముంబైనే. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కల్చర్ మెళ్లిగా ఊపందుకుంటోంది. మిగిలిన వివరాలు తెలుసుకుందాం..
డబ్బావాలా గురించి ఎప్పుడైనా విన్నారా? బిజీబిజీ సిటీ లైఫ్‌లో పిల్లలు, భర్తకు సమయానికి వండిపెట్టేందుకు పరిస్థితులు అనువుగా ఉండవు. దీంతో డబ్బావాలా అనే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ముంబైలో ఈ డబ్బావాలా సంస్కృతిని ఎక్కువగా చూడొచ్చు. ఉదయం హడావుడిగా స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లిన వారికి వేడివేడిగా ప్యాక్ చేసిన లంచ్ బాక్స్‌ను అందించడమే డబ్బావాలాల పని. ముంబైలోని లోకల్ ట్రైన్స్, ఆటో రిక్షాల సాయంతో డబ్బావాలాలు ప్రయాణిస్తూ నిర్ణీత సమాయానికి వేడివేడి లంచ్ బాక్సులను అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. క్రమంగా ఈ డబ్బావాలాల కల్చర్ ముంబై నుంచి దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ విస్తరించింది. ఇప్పుడు ప్రధాన నగరాల నుంచి పట్టణాల్లోకి డబ్బావాలాల సంస్కృతి వచ్చేసింది. తెలంగాణలోనూ ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.
తాజాగా కరీంనగర్లో డబ్బావాలా సర్వీసులు మొదలయ్యాయి. లంచ్ టైమ్‌కు 45 నిమిషాల ముందు బాక్స్‌లను తీసుకుని.. గమ్యస్థానాలకు తీసుకెళ్లి.. ఎంప్లాయీస్, స్టూడెంట్స్‌కు అందిస్తున్నారు డబ్బావాలాలు. తద్వారా కస్టమర్లు వేడివేడిగా రుచికరమైన ఆహారాన్ని తింటూ ఆనందిస్తున్నారు. సహస్ర అనే డబ్బావాలా సంస్థ అయితే ఇలా కస్టమర్ల నుంచి భోజనాన్ని పిక్ చేసుకుని గమ్యస్థానాలకు చేర్చడమే గాక.. తమ కిచెన్‌లో ప్రత్యేకంగా భోజనాలను ప్రిపేర్ చేస్తూ ఉద్యోగులు, విద్యార్థులకు అందిస్తోంది. స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతోందనే ఉద్దేశంతోనే ఈ సహస్ర అనే డబ్బావాలా స్టార్టప్‌ను మొదలుపెట్టామని మహేందర్ చెప్పారు. పిల్లలకు వేడివేడి భోజనాన్ని అందించాలనే సంకల్పంతో డబ్బావాలాను ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రతి రోజూ ఉదయం 11.30 గంటలకు పేరెంట్స్ ఇంటి నుంచి బాక్సులను తీసుకుని.. లంచ్ బ్రేక్ సమయానికి పిల్లలకు అందిస్తామని మహేందర్ తెలిపారు.
తమ దగ్గర నలుగురు డెలివరీ బాయ్స్ పని చేస్తున్నారని.. 50 ఆర్డర్లు వరకు ఉన్నాయని మహేందర్ చెప్పుకొచ్చారు. రీసెంట్గా సొంత కిచెన్ తెరిచామని.. ఆర్డర్ చేసిన ఉద్యోగులకు ఇంటి భోజనం తరహాలో వండిన రుచికరమైన ఫుడ్‌ను ఆఫీసులకు వెళ్లి డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు. తమ కిచెన్ నుంచి తీసుకెళ్లే భోజనానికి సంబంధించి ఉద్యోగులకు నెలకు రూ.2,300 ఛార్జ్ చేస్తున్నామని, అదే పిల్లలకు అయితే రూ.1,500 తీసుకుంటున్నామని వివరించారు. అదే పిల్లల ఫుడ్‌ను వారి ఇంటి నుంచి పికప్ చేసుకునేందుకు 3 కిలోమీటర్ల లోపు దూరానికి నెలకు రూ.600 తీసుకుంటున్నామని మహేందర్ చెప్పారు. ఆ తర్వాత దూరానికి తగ్గట్లు ధరలు కాస్త పెరుగుతాయన్నారు. మరి.. తెలుగునాట కూడా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న డబ్బావాలా సంస్కృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.