నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే దేశమంతా 24 గంటల ఉచితంగా కరెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, నూతన కలెక్టరేట్ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే లోక్ సభ ఎన్నికలో బీజేపీ యేతర పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని నిజామాబాద్ గడ్డమీద నుంచే ప్రారంభిస్తానని తెలిపారు. 28 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి దేశ రాజకీయాల్లోకి రావాలని తనను ఆహ్వానించారని కేసీఆర్ వెల్లడించారు. నిజామాబాద్ కాల్వల్లో నీళ్లురావాలా? మత పిచ్చి మంటలతో రక్తం పారాలా? అని ప్రశ్నించారు. దేశంలో దళితులకు రూ. 10 లక్షలు ఇచ్చిన రాష్ట్రం తమదేనని, గతంలో రూ. 200 పెన్షన్ ఇస్తే ఇప్పుడు రూ. 2వేలు ఇస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ, కార్పొరేట్ కంపెనీలు రైతుల భూముల కోసం చూస్తున్నాయి. రైతుల భూములు లాక్కోవాలని చూస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
మన దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి ఉందని, అందులో 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనువైన భూములుగా ఉన్నాయని తెలిపారు. అనేక గొప్ప నదులు దేశంలో ఉన్నాయని, ఒక్కటి కూడా పెద్ద రిజర్వాయర్లు లేవని ఆయన పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదని, అన్ని అమ్ముకోవడమే తప్ప.. కొత్తది చేయలేదంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దయ చేసి రైతు సంఘాలు, రైతు బిడ్డలు సమావేశాలు పెట్టి.. రైతు వ్యతిరేక విధానం అవలంభిస్తున్న పార్టీలను తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు. మరి.. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.