నిర్మలా సీతారామన్ తెలంగాణ పర్యటనలో భాగంగా వివాదాస్పద సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్ ఓ రేషన్ షాపును సందర్శించారు. అక్కడ మోదీ ఫోటో లేకపోవడంపై ఆమె కలెక్టర్‌పై సీరియస్ అయ్యారు. ఈ సంఘటనపై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సంఘటనపై మినిస్టర్ హరీశ్ రావు స్పందించారు. బీజేపీ నాయకులు ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంత దిగజారేలా మాట్లాడవద్దు అని సూచించారు. బీజేపీ నాయకులు రేషన్ దుకాణాల్లో ఇస్తున్న బియ్యాన్ని కేంద్రమే ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారు.. కానీ తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న 10 కేజీల బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వమే భారీగా ఖర్చు చేస్తుందని హరీశ్ రావు తెలిపారు. ‘‘దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ నుంచే కేంద్రానికి నిధులు వెళ్తున్నాయి. రేషన్ షాపుల దగ్గర మోదీ ఫోటో పెట్టాలంటున్నారు.. మరి కేంద్రానికి నిధులు మేం ఇస్తున్నాం.. కనుక ముందు కేంద్రంలో కేసీఆర్ ఫోటో పెట్టండి’’ అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇక నిర్మలా సీతారామన్ తన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పి ఆమె తన గౌరవం నిలుపుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇక ‘‘తెలంగాణ ఆయుష్మాన్ భారత్‌లో చేరలేదని నిర్మలా సీతారామన్ అంటున్నారు.. ఇది తప్పని నేను నిరూపిస్తే.. ఆమె రాజీనామా చేస్తారా.. ఒకవేళ ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమైతే నేను రాజీనామా చేస్తాను’’ అంటూ హరీశ్ రావు సవాల్ చేశారు. మరి దీనిపై నిర్మలా సీతారామన్ ఎలా స్పందిస్తారో చూడాలి. హరీశ్ రావు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: కలెక్టర్‌పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం.. అరగంటలో ఆన్సర్ చెప్పాలంటూ! ఇది కూడా చదవండి: మంత్రి హరీశ్ రావుకు కన్నీళ్లు తెప్పించిన సంఘటన.. వీడియో వైరల్