సమస్య ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైన ఆవిష్కరణ ఉంటుంది. ఇల్లేమో ఊరికి దూరం. దగ్గర్లో విద్యుత్ స్తంభాలు లేవు. కరెంట్ స్తంభాలకు ఖర్చు పెట్టాలంటే తలకు మించిన భారం. అధికారులు కరెంట్ ఇవ్వడం కుదరదన్నారు. దీంతో ఆ యువకుడు కరెంట్ లేకుండా బోర్ లోంచి నీళ్లు బయటికి తోడాడు. కరెంట్ లేకుండా బోర్ నీటిని తోడడం కష్టం కదా. కానీ ఈ యువ భగీరథుడు రోజూ కరెంట్ లేకుండా బోర్ నీటిని తోడుతూ.. ఆ నీటిని కొత్త ఇంటి నిర్మాణం కోసం వాడుతున్నాడు. ఇంతకే అదెలా సాధ్యమనేగా ఆలోచిస్తున్నారు. అయితే ఈ స్టోరీ చదివేయండి.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్, లత దంపతులకు శివకుమార్ అనే కొడుకు ఉన్నాడు. అతను వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. 12 ఏళ్లుగా సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఆ కుటుంబ కల. అందుకోసం కష్టపడి డబ్బు పోగేసి ఊరి చివర ఇటీవల కొంత భూమి కొనుక్కున్నారు. ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నారు. ఇంటి నిర్మాణం అంటే ఖచ్చితంగా నీళ్ల బోర్ ఉండాల్సిందే. అందుకోసం బోర్ కూడా వేయించారు. నీళ్లు కూడా వచ్చాయి. అయితే నిరంతరం ఆ నీళ్లు పైకి రావాలంటే కరెంట్ ఉండాలి. ఇండ్ల స్థలం ఉన్న ప్రాంతంలో ఎక్కడా కూడా కరెంట్ స్తంభాలు లేవు. విద్యుత్ అధికారులను అడిగితే.. కుదరదని అన్నారు. అంతగా కరెంట్ కావాలంటే విద్యుత్ స్తంభాలు వేయాల్సి ఉంటుందని.. వాటికయ్యే ఖర్చు మీరే భరించాలని అన్నారు.
విద్యుత్ స్తంభాలు అంటే ఒకటి, రెండు అంటే పెట్టుకోవచ్చు గానీ ఊరి చివర ఉన్న ఇంటికి రావడానికి ఎన్నని వేయగలమని చెప్పి నిరాశ చెందారు. ఇక తమ ఇల్లు పూర్తి కాదేమో అని బాధపడ్డారు. అయితే శివకుమార్ తల్లిదండ్రుల బాధ చూసి ఏదైనా పరిష్కారం ఆలోచించాలని అనుకున్నాడు. ఎలాగైనా బోర్ లోంచి నీళ్లు రప్పించాలని అనుకున్నాడు. కరెంట్ లేకుండా ఎలా ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఒక ఉపాయం తట్టింది. తన దగ్గరున్న బైక్ సహాయంతో బోర్ లోంచి నీటిని పైకి తీసుకురావచ్చునని అనుకున్నాడు. స్వతహాగా వడ్రంగి కావడంతో తనకున్న మేథస్సుతో కొన్ని పరికరాలు తీసుకొచ్చాడు. బోరులో కరెంట్ మోటార్ ని పెట్టి.. బైక్ వెనుక చక్రానికి ఒక మోటార్ ని అమర్చాడు. చక్రం తిరిగినంత సేపు మోటార్ తిరుగుతుంది.
ఈ మోటార్ నుంచి వచ్చే శక్తితో బోర్ మోటార్ తిరుగుతుంది. ప్రెజర్ కి బోర్ లో ఉన్న నీళ్లు బయటకు వచ్చేలా ఏర్పాటు చేశాడు. బైక్ స్టార్ చేసి చూస్తే.. నీళ్లు ప్రవాహంలా వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు సంతోషించారు. ఆ నీటితో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. రోజూ బైక్ సహాయంతో బోర్ మోటార్ ని వాడుతూ నిర్మాణం చేపడుతున్నారు. ఇళ్ల గోడల వరకూ నిర్మాణం జరిగింది. ఇల్లు నిర్మాణ పనుల కోసం బోర్ నుంచి నీటిని రప్పించడానికి రోజూ రూ. 200 పెట్రోల్ ఖర్చు అవుతుందని శివ కుమార్ వెల్లడించాడు. అధికారులు కరెంట్ ఇవ్వడం లేదని ఇలా బైక్ సహాయంతో బోర్ మోటార్ ని నడుపుతున్నామని, విద్యుత్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారని.. పేదలమైన తమకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరి ప్రభుత్వానికి తెలిసేలా ఈ విషయాన్ని షేర్ చేస్తారు కదూ.