తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన కారుకు టోల్ సిబ్బంది రూట్ క్లియర్ చేయలేదని ఆగ్రహంతో దాడి చేశారని చెబుతున్నారు. తన కారు సైరెన్ కొడుతున్నా టోల్ సిబ్బంది పట్టించుకోలేదనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కారు మందమర్రి టోల్ ప్లాజా వద్దకు వచ్చింది. అయితే ఆయన కారు ముందు ఓ కారియర్ వాహనం కనిపిస్తోంది. తన కారు వస్తుంటే ఆ వాహనాన్ని పంపి రూట్ క్లియర్ చేయలేదనే సిబ్బందిపై దాడికి దిగారని చెబుతున్నారు. అయితే వీవీఐపీలకు కేటాయించిన లైన్ లోకి కాకుండా.. ఎమ్మెల్యే కారు టోల్ వసూలు చేసే లైన్ లోకి వచ్చినట్లు టోల్ ప్లాజా సిబ్బంది తెలియజేస్తున్నారు. సైరెన్ వేస్తుంటే విషయం కనుక్కోవాడానికి వెళ్లిన వారిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి దిగినట్లు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన మొత్తం పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఎమ్మెల్యే ఆగ్రహానికి ఓ వ్యక్తి అక్కడి నుంచి పరుగు తీశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగింది. అయితే దాడి సమయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్యం మత్తులో ఉన్నారంటూ టోల్ ప్లాజా సిబ్బంది ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. టోల్ సిబ్బందిపై దాడి చేశారనే ఆరోపణలను ఆయన ఖండించారు. తాను ఎవరిపై దాడి చేయలేదని స్పష్టం చేశారు.
కేవలం మాట్లాడానంటూ చెప్పుకొచ్చారు. రోడ్డు ఇంకా పూర్తి కాకుండానే టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారంటూ అధికారులను ఫోన్ చేసి అడిగే ప్రయత్నం చేశానన్నారు. అంబులెన్స్ లను కూడా డబ్బు అడుగుతున్నారని మండిపడ్డారు. రోడ్డు పనులు పుర్తైన తర్వాతే టోల్ డబ్బులు వసూలు చేయాలని సూచించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు స్థానికంగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడాన్ని దుర్గం చిన్నయ్య అనుచరులు తప్పుబడుతున్నారు.