వరంగల్ లో తనపై జరిగిన దాడిపై బైరి నరేష్ స్పందించాడు. మూఢనమ్మకాలు ఉండకూడదనేదే తన లక్ష్యమని కామెంట్లు చేశాడు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని, లైసెన్స్డ్ గన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
గతంలో అయ్యప్ప స్వామి జననం గురించి, చరిత్ర గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయి షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన బైరి నరేష్ పై హిందూ సంఘాల కార్యకర్తలు దాడి చేశారు. అయితే బెయిల్ పై బయటకొచ్చిన బైరి నరేష్ అయ్యప్ప పుట్టుకకు సంబంధించిన ఆధారాలు నాకు కావాలి అని ఓ ఇంటర్వ్యూలో అడిగాడు. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో వరంగల్ లోని ఆదర్శ కాలేజ్ లో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న బైరి నరేష్ పై హిందూ సంఘాల కార్యకర్తలు దాడి చేశారు. బైరి నరేష్ ను వెంబడించి, బట్టలు చింపి పరుగులు పెట్టించారు. అయితే ఈ ఘటనపై బైరి నరేష్ స్పందించాడు. తనకు లైసెన్స్డ్ గన్ కావాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
తనపై బీజేపీ, భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించాడు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పానని, మరోసారి క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు. తాను చేసిన వ్యాఖ్యలను తిరిగి వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడించాడు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించినా నన్ను క్షమించండి అని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయను అని అన్నాడు. దేవుడు లేడు, కుల మతాలు ఉండకూడదు, మూఢనమ్మకాలు ఉండకూడదు, శాస్త్రీయ సమాజమే తన లక్ష్యం అని వ్యాఖ్యానించాడు. క్షమాపణలు వందసార్లు చెప్పమంటారా? వెయ్యి సార్లు చెప్పమంటారా? పోలీస్ జీపులో ఉన్న తనపై ఎస్సై పక్కనే ఉండగా దాడి చేశారంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీస్ వ్యవస్థ ఉందా? మత రాజ్యం ఉందా? అంటూ ప్రశ్నించాడు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ వాళ్ళ చేతుల్లో మేము ఇలానే బలి కావాలా? ప్రజాస్వామికవాదులారా ఏకం కండి. ఈరోజు నన్ను కొడుతున్నారు. రేపు మిమ్మల్ని కొడతారు అంటూ వ్యాఖ్యానించాడు. తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, లైసెన్స్డ్ గన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే బైరి నరేష్ వ్యాఖ్యలపై హిందువులు సీరియస్ అవుతున్నారు. క్షమాపణ చెప్పినా వదిలిపెట్టేది లేదని అంటున్నారు. ప్రతివాడూ హిందూ దేవుళ్ళని దూషించడం, క్షమాపణ చెప్పడం ఫ్యాషన్ అయిపోయిందని.. గట్టిగా బుద్ధి చెప్తేనే గానీ దారిలోకి రారని కామెంట్లు చేస్తున్నారు. మరి బైరి నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.