హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న సాత్విక్(16) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సాత్విక్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది.
హైదరాబాద్ లోని నార్సింగిలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సాత్విక్ మృతితో అతడి తల్లిదండ్రులు తీవ్రవేదనకు గురవుతున్నారు. అలానే కాలేజీలో ఒత్తిడి వల్లే తమ స్నేహితుడు ఉరి వేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ ఆత్మహత్యపై కాలేజీ యాజమాన్యం స్పందించలేదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదని విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ ఆత్మహత్య పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
సాత్విక్ మృతిపై స్పందించిన ప్రభుత్వం.. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డు ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన కమిటీ.. నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న కళాశాలలో అతడికి అడ్మిషన్ లేదని పేర్కొంది. ఒక కాలేజీలో అడ్మిషన్ ఇచ్చి మరో కాలేజీలో తరగతులు నిర్వహిస్తున్నారని రిపోర్ట్ లో వెల్లడించింది. అయితే ఈ నివేదికపై తల్లిదండ్రులు స్పందించారు. తమకు అడ్మిషన్ సమయంలో నార్సింగ్ కళాశాల పేరుతోనే రశీదు ఇచ్చారని, తమకు న్యాయం చేయాలని సాత్విక్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
సాత్విక్ ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాలేజీ లెక్చరర్ల వేధింపులు, హింస, అవమానం భరించలేకనే తమ కుమారుడు సూసైడ్ చేసుకున్నాడని మృతుడు తండ్రి రాజప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం, ఆత్మహత్య లేఖ ఆధారంగా కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపల్ నర్సింహాచారి, ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శోభన్ బాబు, హాస్టల్ వార్డెన్ నరేశ్ లను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆయన ఆదేశాల మేరకు ఆ నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు.