హైదరాబాద్ నగర వాసులకు సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు, కార్యక్రమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నగర వాసులకు ఇప్పటికీ వెంటాడుతున్న సమస్యల్లో ట్రాఫిక్ అనేది ప్రధానంగా ఉంటుంది. అందుకే ఈ ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తూనే ఉంది.
హైదరాబాద్ నగర వాసులు సురక్షిత, సౌకర్యవంతమైన జీవనం కొనసాగించేందుకు ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తోంది. అందులో భాగంగా నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా ఎప్పటి నుంచో రోడ్లు, పైవంతెనల నిర్మాణాలు చేస్తున్నారు. రోడ్డు వైడినింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లను పరిరక్షించడం, అవసరమైన చోట్ల కొత్తగా రోడ్లను నిర్మించడం, లింకు రోడ్లను ఏర్పాటు చేయడం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. తద్వారా ట్రాఫిక్ జామ్ లు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
హైదరాబాద్ నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత కృషి చేస్తోందో అందరికీ తెలిసిందే. ఎస్సార్ డీపీ ద్వారా మొత్తం 10 రకాల పనులను పూర్తి చేసేందుకు రూ.2335.42 కోట్లు వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ఆ పనుల్లో పైవంతెనల నిర్మాణం కూడా ఉంది. ఎస్సార్ డీపీ ద్వారా చేపట్టిన 47 పనుల్లో ఇప్పటివరకు 35 పనులు పూర్తయ్యాయి. ఇది మాత్రమే కాదు.. హైదరాబాద్ నగరవాసులకు ఇంకో శుభవార్త ఏంటంటే ఆ పనుల్లో భాగంగా చేపట్టిన ఎల్బీ నగర్ ఆర్ హెచ్ఎస్ ఫ్లైఓవర్ పూర్తైంది. ప్రారంభానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే మంత్రి కేటీఆర్ ఈ పైవంతెనను ప్రారంభిస్తారని చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం ఆలస్యమైనట్లు జీహెచ్ ఎంసీ తెలిపింది. ఈ వంతెన 700 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఉంది. ముఖ్యంగా ఎల్బీనగర్ జంక్షన్ లో మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుపోకుండా ఉండేందుకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుంది. ఈ పైవంతెన ద్వారా హయత్ నగర్ నుంచి సిటీలోకి వచ్చే వారికి, ఏపీ, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఎల్బీ నగర్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు తప్పనున్నాయి. ఎస్సార్ డీపీ ద్వారా పెడింగ్ లో ఉన్న మిలిగిన పనులను కూడా ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కృషి చేస్తున్నారు.
అంతేకాకుండా ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం రోడ్ల నిర్మాణం, లింకు రోడ్ల నిర్మాణం చేస్తోంది. లింకురోడ్ల రోడ్ల అభివృద్ధి కోసం హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూ.2140 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలో ఇప్పటికే రూ.275.53 కోట్లతో 22 ప్రాంతాల్లో 24.30 కిలోమీటర్ల మేర లింకు రోడ్లను అభివృద్ధి చేశారు. అత్యధికంగా వెస్డ్ జోన్, కోర్ సిటీలో ఈ లింకు రోడ్లను విడతల వారీగా నిర్మిస్తున్నారు. మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలికేందుకు లింకు రోడ్డు నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలు కూడా చేశారు.