అంబర్‌పేట వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ప్రదీప్ కుటుంబానికి ఆర్జీవీ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో.. స్వయంగా ఆర్జీవీనే రంగంలోకి దిగాడు. ప్రదీప్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రజలను కోరాడు. ఆవివరాలు..
అంబర్‌పేట వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్.. దారుణంగా గాయపడి.. మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించడమే కాక.. బాధితుడి కుటుంబానికి మద్దతుగా నిలిచారు. వారి కుటుంబం తరఫున ఆర్జీవీ న్యాయ పోరాటం ప్రారంభించాడు. ఇక తాజాగా మెడికో ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం 30 లక్షల రూపాయాల ఆర్థిక సాయం అందజేసింది. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ.. ప్రీతి కుటుంబానికి సాయం చేశారు బాగానే ఉంది.. మరి చిన్నారి ప్రదీప్ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి.. ఎందుకు పట్టించుకోవడం లేదంటూ పోస్ట్ చేశారు. దీనిపై చాలా మంది నెటిజనులు.. ఆర్జీవీకి మద్దతు తెలుపుతున్నారు. ప్రదీప్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఇక తాజాగా చిన్నారి ప్రదీప్ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆర్జీవీ.. మరో అడుగు ముందుకు వేశారు. బాధితుడి కుటుంబానికి సాయం చేయాలని కోరుతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
చిన్నారి ప్రదీప్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ.. ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ప్రదీప్ తండ్రి అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేశాడు. ప్రదీప్‌కు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ.. ‘‘ప్రజలందరికి మరీ ముఖ్యంగా సినిమాలు, రాజకీయాల్లో ఉన్న సెలబ్రిటీలకు నా అభ్యర్థన ఒక్కటే. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి మీకు తోచినంత ఆర్థిక సాయం చేయండి. కనీసం ఇలా చేస్తే అన్నా.. చిన్నారి ప్రదీప్ కుటుంబానికి న్యాయం జరుగుతుంది’’ అంటూ ప్రదీప్ తండ్రి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. దీనికి నెటిజనుల నుంచి భారీ ఎత్తున స్పందన వస్తోంది. ప్రభుత్వం చేయలేని పని ఆర్జీవీ చేస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.
My sincere request to all people including celebrities ,be it in politics , films or otherwise is to send whatever money you can,to this killed boy’s parents account ..This is the least we can do 🙏🙏🙏 #JustifyPradeep pic.twitter.com/7glfbIShgO
— Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2023
అంతకు ముందు జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఆమెను కుక్కల మధ్యలో వేస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు ఆమెకు కూడా అర్థం అవుతుందని అన్నారు. అంతేకాక ఈ సంఘటన చోటు చేసుకున్న నాటి నుంచి ఆర్జీవీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీనిపై ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించారు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. అంతేకాక బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి తక్షణం ఎలాంటి సాయం అందిందో వివరించాలని డిమాండ్ చేశారు.
అలానే బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగానే కాకుండా మేయర్ గద్వాల విజయ లక్ష్మి లాంటి జంతు ప్రేమికులు.. ఎలాంటి నగదు సాయం చేయబోతున్నారో కూడా తెలపాలని ఆర్జీవీ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కోరారు. మరి ప్రదీప్ కుటుంబం కోసం ఆర్జీవీ చేస్తోన్న ప్రయత్నంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.