విమానాలు రద్దవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాసేపట్లో ప్రయాణం అనగా హఠాత్తుగా ఫ్లైట్స్ రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన ఫ్లైట్స్‌ను ఆ సంస్థ యాజమాన్యం రద్దు చేసింది. ఆపరేషనల్స్ కారణం చూపుతూ విమానాలను ఆఖరి నిమిషంలో రద్దు చేయడం వివాదాస్పదంగా మారింది. ముందుగా ప్యాసింజర్లకు ఎలాంటి సమాచారం అందించకుండానే ఎయిరిండియా యాజమాన్యం విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి 40 మంది ప్రయాణికులు వచ్చారు. తాము వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రకటించడంతో వారితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా క్యాన్సిల్ చేయడం ఏంటని ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ప్రయాణికులు నిలదీశారు. తమ విలువైన సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. ముందుగా చెబితే తాము ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వారమని వాగ్వాదానికి దిగారు. దీంతో ప్యాసింజర్లను శాంతింపజేసిన సిబ్బంది.. డబ్బులు రీఫండ్ చేస్తామని, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మనీ రీఫండ్ చేసినా.. చివరి నిమిషంలో తాము వెళ్లాల్సిన ఫ్లైట్ రద్దు కావడంతో ప్రయాణికులు నిరాశతో వెనుదిరిగారు. కాగా, హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, విశాఖపట్నం, మైసూరు వెళ్లే విమానాలు.. అక్కడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాలు రద్దయ్యాయి.