వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే భర్త ప్రజలకు రక్షణగా నిలిచే ఉద్యోగంలో ఉండటం గమనార్హం. పెళ్లి సమయంలో ఇస్తానన్న కట్నం ఇవ్వలేదని.. పుట్టింటికి వెళ్లి తేవాలని భార్యను వేధింపులకు గురి చేశాడు. అయితే..
వరకట్నవేధింపులకు ఎంతో మంది అబలలు బలౌతున్నారు. ఆడ పిల్లలు దొరికితే చాలురా దేవుడా.. కులం, మతమే కాదూ కట్నం ఇవ్వకపోయినా చేసుకుంటామని ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో, ఎంత కొంత వరకట్నం తీసుకు వచ్చిన కోడల్ని, మరింత సొమ్ములు తీసుకురావాలని అత్తారింట్లో వేధింపులకు గురి చేస్తున్నారు. వీటిని తాళలేక అయామక మహిళలు బలౌతున్నారు. అనాధిగా వస్తున్న ఈ ఆచారం ఇంకా భారత్‌లో వేళ్లూనుకుపోతోంది. తాజాగా ఓ వరకట్న వేధింపులతో పచ్చి బాలింతరాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నార్నూర్ మండలం సుంగాపూర్‌కు చెందిన ఐశ్వర్య (20) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్న బండారి మహేష్‌తో గత ఏడాది ఫిబ్రవరి 3న వివాహం జరిగింది. అయితే పెళ్లి సమయంలో రూ. 22 లక్షల కట్నం ఇచ్చేందుకు ఐశ్వర్య తల్లిదండ్రులు అంగీకరించగా.. పెళ్లి సమయానికి రూ. 10 లక్షలు ముట్టజెప్పారు. మహేష్ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్‌గూడ 32వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పెళ్లైన తర్వాత ఆమెన తమకు ఇవ్వాల్సిన కట్నం తీసుకు రావాలంటూ ఐశ్వర్యను వేధించేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే.. అతడికి సర్థి చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
ఇంతలో ఐశ్వర్య గర్భం దాల్చడంతో .. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. గత నెల 6వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అప్పటి నుండి ఆమెను మరింత వేధిస్తున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన ఐశ్వర్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందింది. దీంతో కుటుంబీకులు రిమ్స్ ఆవరణలో ఆందోళనకు దిగారు. మృతురాలి భర్తతో పాటు అత్తింటి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. పోలీసులు సముదాయించేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. దీంతో రిమ్స్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం టూటౌన్ సీఐ పురుషోత్తం చేరుకుని భరోసా కల్పించడంతో ఆందోళన విరమించారు.