ఓ రైతు పంట పండించేందుకు ఆరుగాలం కష్టపడుతుంటాడు. నారు పోసిన నాటి నుండి పంట అమ్ముడుపోయే వరకు అగచాట్లు పడుతుంటాడు. దుక్కు దున్ని, నారు పోసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు కంటి మీద కునుకు వేయడు. పంట మొలకలేసి, ఓ దశకు వచ్చాక వాటికి పట్టే తెగుళ్ల నుండి పిట్టలు, ఎలుకలు, కోతులు పంట నాశనం చేయడం వంటి అన్ని సమస్యలను ఎదుర్కొటారు. పంటకు పట్టే తెగుళ్లకు అయితే మందులు వేస్తే సరిపోతుంది కానీ, మిగిలిన వాటి సమస్యే కొంచెం తీవ్రం. వీటి కోసం పొద్దున నుండి రాత్రి వరకు చేను దగ్గర కాపాలా కాయలేని పరిస్థితి.
ఇటువంటి సమస్యనే ఎదుర్కొన్నాడో రైతు. కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి ఓ వినూత్న ఆలోచన చేశాడు. తెలంగాణాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వలిమెల మండలం బూరుగ్గూడెంలో ఉంటున్న ఓ రైతు, తన పంట చేనులో కోతుల బెడదను ఎదుర్కొంటున్నాడు. ఎన్ని ఆలోచనలు చేసినా అవి చేనులోకి వచ్చి.. పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో అతడు ఓ వినూత్న ఆలోచన చేశాడు. ఓ కుక్కను తీసుకువచ్చి నలుపు రంగుతో పులిలా చారలు గీసి చేనులో కాపలాకు పెట్టాడు. పంట చేను వద్ద పులిని తలపిస్తున్న శునకాన్నిచూసి భయపడిన కోతులు పంట చేనులోకి రాకపోవడంతో రైతు తన కృషి ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.