స్మార్ట్ ఫోన్ వాడకం చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లేనిదే జీవించే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఫోన్ అనేది మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ ని అతిగా వాడితే ఎంత ముప్పు అనే విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదు. ముఖ్యంగా యువతకి స్మార్ట్ ఫోన్ వాడటం అనేది వ్యసనంలా మారిపోయింది.
స్మార్ట్ ఫోన్.. ఇది ఇప్పుడు మనిషి శరీరంలో ఒక భాగం అయిపోయింది. ఏం పని లేకపోయినా సరదాగా రీల్స్ చూడటానికి అయినా ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. చంటి పిల్లల నుంచి స్కూలు, కాలేజ్, ఉద్యోంగ, హౌస్ వైఫ్స్ ఇలా ఎవరైనా స్మార్ట్ ఫోన్ పట్టుకోవాల్సిందే. అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్ వాడకం అనేది అలవాటు అయిపోయింది. సిగిరెట్, మద్యం ఎలాగో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక వ్యసనం అయిపోయింది. ముఖ్యంగా యువత వీటికి బాగా అడిక్ట్ అవుతున్నారు. గత రెండేళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం మరీ ఎక్కువైంది. అయితే ఇలా విచ్చల విడిగా స్మార్ట్ ఫోన్ వాడటం మంచిదేనా?
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరిగింది. ఏదైనా అవసరానికి మించి ఎక్కువగా వాడితే ప్రమాదానికే దారి తీస్తుంది. అదే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల విషయంలో జరుగుతోంది. నిండా పదిహేనేళ్లు రాకుండానే పిల్లలకు కళ్లజోడు రావడం, పిల్లలు వెన్ను నొప్పితో బాధ పడటం చూస్తున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతోందంటే.. స్మార్ట్ ఫోన్ ని ఎక్కువగా వాడటం వల్లే జరగుతున్నట్లు వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో 3 గంటలకు మించి స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నట్లైతే ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోక తప్పదు.
విచ్చలవిడిగా ఫోన్ వాడుతున్న యువతలో చాలా సమస్యలు బయటపడుతున్నాయి. నిద్రలేమి సమస్య, వెన్నునొప్పి, వెంటనే కోపం రావడం, అసహనానికి లోనవడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మానసికంగానూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లల ఎదుట స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు. స్కూల్, కాలేజ్ ఇలా వయసు ఏదైనా పిల్లల విషయంలో మాత్రం పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పించైనా చదువులపై శ్రద్ధ పెట్టేలా చూసుకోవాలంటున్నారు. ఎవరైనా రోజులో 3 గంటలకు మించి స్మార్ట్ ఫోన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.