ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచింది మొదలు..నిద్రపోయేవరకు మొబైల్ తోనే గడిపేస్తున్నాం. అందులోను ముఖ్యంగా సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ఎక్కువుగా ఉపయోగిస్తుంటాం. ఎదుటివారి బాగోగులు తెలుసుకోవాలన్నా, మనకు దూరంగా ఉంటున్న వారిని చూడాలన్నా ఈ యాప్ ను ఎక్కువుగా వాడుతుంటాం. ఇలా ఎదుటివారితో చాట్ చేస్తున్న సమయంలో.. మనకు సంతోషం, బాధ ఏది కలిగినా ఎమోజీలు పంపుతూ మన ఫీలింగ్స్ ని తెలియజేస్తుంటాం. ఇలా ఎమోజీలు పంపుతున్న యూజర్లకు గల్ఫ్ దేశం సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకమీదట వాట్సాప్ చాట్ లో ‘రెడ్ హార్ట్’ ఎమోజీలు పంపిస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని అక్కడి ప్రభుత్వం యూజర్లను హెచ్చరించింది.సౌదీ అరేబియా తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. వాట్సాప్ చాట్స్‌లో ‘రెడ్ హార్ట్‘ ఎమోజీలు పంపించడం వేధింపులతో సమానమైన నేరంగా పరిగణించబడుతుందని అక్కడి అధికారులు తెలిపారు. వాట్సాప్‌లో కొన్ని రకాల ఇమేజెస్, ఎక్స్‌ప్రెషన్స్‌ను పంపించడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా వాట్సాప్ యూజర్స్.. ఎదుటివాళ్ల అంగీకారం లేనిదే వారితో చాట్ చేయడం నేరం. వారిని ఇబ్బందిపెట్టే రీతిలో చాట్‌లో సంభాషణలు జరపకూడదన్నారు. ముఖ్యంగా రెడ్ హార్ట్ ఎమోజీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అక్కడి నిరోధక చట్టం ఏం చెపుతుందంటే
ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి చేతల ద్వారా లేదా మాటల ద్వారా భంగం కలిగించేలా వ్యవహరిస్తే దాన్ని వేధింపుల కిందనే పరిగణిస్తారు. ఆచార సాంప్రదాయాల ప్రకారం వాట్సాప్‌లో ‘రెడ్ హార్ట్’ లేదా ‘రెడ్ రోజెస్’ వంటి ఎమోజీలను పంపించడం గౌరవానికి భంగంగా పరిగణిస్తారట. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే దోషికి లక్ష సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధిస్తారు. ఇలాంటి నేరాల్లో ఒకటి కన్నా ఎక్కువసార్లు దోషిగా తేలితే 3 లక్షల సౌదీ రియల్స్‌ను జరిమానాగా విధించడంతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.