ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని దేశాల్లోని మొబైల్ లవర్స్‌కు ఐఫోన్ కొనాలనేది ఓ కల. చాలా దేశాల్లో కిడ్నీలు అమ్మిమరీ ఐఫోన్ కొన్న వారు కూడా ఉన్నారు. మార్కెట్‌లోకి ఐఫోన్‌కు సంబంధించి ఏ మోడల్‌ను విడుదల చేసినా అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. అలాంటి యాపిల్ ఐఫోన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. చైనాలోని తాజా పరిస్థితులతో తలమునకలయ్యేంత ఇబ్బందుల్లో పడిపోయింది. యాపిల్ ఐఫోన్‌లకు సంబంధించి చైనా, షెంజౌవ్ నగరంలోని ఫాక్స్‌కాన్ కంపెనీలో అధికంగా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి కంపెనీలో కార్మికులు ఆందోళనకు దిగారు. పనికి వెళ్లకుండా నిరసన తెలియజేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే..
చైనాలో కరోనా పరిస్థితులు ఇంకా అలాగే ఉండటమే. కరోనా కారణంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. రూల్స్‌ను కూడా చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో ఫాక్స్‌కాన్ కంపెనీలో కార్మికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. కంపెనీలోంచి బయటకు రావటానికి లేక, కంపెనీలో సరైన తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. దానికి తోడు జీతం విషయంలోనూ వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన బోనస్‌ను కూడా కంపెనీ వాయిదా వేసింది. ఈ పరిణామాలతో కార్మికులు ఎదురు తిరిగారు. నిరసన బాటపట్టారు. దీంతో ప్రొడక్షన్ పడిపోయింది. యాపిల్ ఫోన్లు తయారు చేసే కంపెనీల్లో ఫాక్స్‌కాన్ అతిపెద్దది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఐఫోన్లను సరఫరా చేస్తుంది. అలాంటి కంపెనీలో ప్రొడక్షన్ నిలిచిపోవటంతో మార్కెట్లోకి విడుదలయ్యే ఫోన్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఐఫోన్ 14 ప్రో సిరీస్ ఫోన్లు ఆర్డర్ చేసిన చాలా మందికి సరైన టైంలో డెలివరీ కావటం లేదు.
దీంతో వారు తమ ఆర్డర్లను క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐఫోన్ సేల్స్ 20 శాతం తగ్గిపోయాయి. ఈ పరిస్థితులను శాంసంగ్ క్యాష్ చేసుకోవటానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ సిరీస్ ఎస్23 అల్ట్రా మోడల్‌ను వీలైనంత త్వరగా మార్కెట్‌లోకి విడుదల చేయటానికి చూస్తోంది. తమ ఫోన్ ఫీచర్లు ఐఫోన్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉండటంతో వినియోగదారులు తమ ఫోన్ వైపు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికితోడు మార్కెటింగ్ విషయంలోనూ సౌత్ కొరియా కంపెనీ మంచి స్ట్రాటజీని ఫాలో అవుతోంది. షాపులలో ఐఫోన్ పక్కనే తమ ఫోన్‌ను కూడా డిస్‌ప్లే చేసేలా చేస్తోంది. చైనాలో ఐఫోన్ తయారీ పరిస్థితులు ఇంకొంత కాలం ఇలాగే కొనసాగితే మార్కెట్‌లో దారుణమైన డౌన్‌ఫాల్‌ను చూసే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు ఇతర కంపెనీలకు అద్భుతంగా కలిసొస్తాయి అనటంలో ఎలాంటి అనుమానం లేదు.