కారు కొనిన తర్వాత చాలా మంది ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఎందుకంటే మోటారు వాహనాల చట్టం ప్రకారం అది తప్పకుండా చేయించాలి. అయితే కారు ఇన్సూరెన్స్ చేయిస్తారు గానీ, దానిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయం వారికి తెలియదు. చాలామంది ఎలా క్లెయిమ్ చేయాలో తెలియక ఇన్సూరెన్స్ ఉన్నా.. సొంత డబ్బుతో రిపేర్ చేయించుకుంటూ ఉంటారు.
కారు కొన్న తర్వాత అందరూ తప్పక చేయించాల్సింది ఇన్సూరెన్స్. అయితే కొత్త కార్లకు కొనుగోలు సమయంలోనే ఇన్సూరెన్స్ చేస్తారు. అది మీరు ఎంచుకున్న పాలసీని బట్టి ఉంటుంది. అయితే కమర్షియల్ కార్లకు మాత్రం ఏటా ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉండాల్సిందే. మీ కారుకి వాలిడ్ ఇన్సూరెన్స్ లేకపోవడం మోటర్ వెహికల్స్ చట్టం ప్రకారం నేరం కూడా. అందుకు మీకు ఫైన్ కూడా పడుతుంది. జరిమానా సంగతి పక్కన పెడితే మీ కారుకి ఇన్సూరెన్స్ ఉండటం మీకే మంచిది. దాని వల్ల అనుకోని ప్రమాదం జరిగితే మీ సొంత డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది. పైగా మీ వల్ల ప్రమాదం జరిగితే బాధితులకు కూడా బీమా కంపెనీనే డబ్బు చెల్లిస్తుంది. అయితే చాలా మందికి ఈ ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవడం తెలియదు. ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలో చూద్దాం.
మీ కారుకి ప్రమాదం జరిగిన తర్వాత మీరు ముందుగా చేయాల్సిన పని బీమా కంపెనీకి సమాచారం తెలియజేయాలి. మీరు ఈ పనిని రెండు విధాలుగా చేయవచ్చు. ఒకటి మీ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి మీకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేయచ్చు. ఇన్సురెన్స్ కంపెనీకి చెందిన అధికారిక వెబ్ సైట్ లో మీరు యాక్సిడెంట్ వివరాలను ఫామ్ రూపంలో సబ్ మిట్ చేయచ్చు.
మీ కారుకి ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఫొటోలు, వీడియోలు తీసుకోవాలి. కారుని యాక్సిడెంట్ స్పాట్ నుంచి తీయక ముందే మీరు ఆ పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ కారుకి ఎలా ప్రమాదం జరిగిందో తెలియజేయడానికి అవి ఆధారాలుగా ఉంటాయి. అంతేకాకుండా మీ కారుకి జరిగిన ప్రమాద తీవ్రతను కూడా తెలియజేసేందుకు అవి ఉపయోగపడతాయి. ఫొటోలు, వీడియోలు తీయకుండా మీ కారుని ప్రమాద స్థలం నుంచి అస్సలు కదిలించకండి.
మీ కారుకి ప్రమాదం జరిగిన తర్వాత మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. ఆ ప్రామాదానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి. మీ కారుకి ప్రమాదం జరిగిందని చెప్పేందుకు ఇది కీలకంగా మారుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు జరిగిన తర్వాత లీగల్ ప్రాసెస్ మొదలవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ కచ్చితంగా ఎఫ్ఐఆర్ అడుగుతుంది. ఈ విషయంలో మరిన్ని వివరాలు, షరతుల కోసం బీమా కంపెనీ పాలసీలను క్షుణ్నంగా చదవండి.
మీ కారుకు జరిగిన ప్రమాదానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లను బీమా కంపెనీకి అందజేయాల్సి ఉంటుంది. మీ కారు ఇన్సూరెన్స్ కాపీ, కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీ డ్రైవింగ్ లైసెన్స్, ఎఫ్‌ఐఆర్ కాపీని బీమా కంపెనీకి అందజేయాల్సి ఉంటుంది. మీ వద్ద అన్ని వాలిడ్ డాక్యుమెంట్లు ఉన్నాయే విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేసేందుకు ఇది చాలా ముఖ్యం.
బీమా కంపెనీ నుంచి మీ కారుని ఇన్ స్పెక్షన్ చేసేందుకు ఒక సర్వేయర్ వస్తారు. ఆ వ్యక్తి మీ కారుకి జరిగిన డ్యామేజ్ ని కాలుక్యులేట్ చేస్తాడు. పూర్తి నివేదికను ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేస్తారు. సర్వేయర్ ఇచ్చే నివేదకను బట్టే మీ కారు క్లెయిన్ ఆధారపడి ఉంటుంది. తర్వాత మీ కారుకు సంబంధించిన క్లెయిమ్ ప్రాసెస్ ముగిసి మీకు ఇన్సూరెన్స్ మొత్తం లభిస్తుంది.
ఇది సాధారణంగా జరిగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్. ఇప్పుడు చాలా కంపెనీలు జీరో పేపర్ వర్క్, 24 గంటల హెల్ప్ లైన్, నెట్ వర్క్ గ్యారేజ్ అసిస్టెన్స్ వంటి ఆఫర్లను కూడా అందజేస్తున్నాయి. మీ బీమా కంపెనీకి నెట్వర్క్ గరాజ్ లు ఉంటే జీరో పేమెంట్ విధానంలో మీ కారుని రిపేర్ చేయించుకోవచ్చు. లేదంటే మీరు ముందుగా రిపేర్ చేయించుకున్న తర్వాత బీమా కంపెనీ నుంచి రీఎంబర్స్ మెంట్ పొందవచ్చు. మీరు తీసుకునే ఇన్సూరెన్స్ ని బట్టే మీకు వచ్చే క్లెయిమ్ అమౌంట్ ఆధారపడి ఉంటుంది. జీరో డిప్ తీసుకుంటే మీకు మొత్తం క్లెయిమ్ లభిస్తుంది. కాంప్రహెన్సివ్ అయితే మీకు 50:50 లభిస్తుంది. అయితే కాంప్రహెన్సివ్ కి యాడాన్ లు ఉంటాయి. వాటి ద్వారా మీరు 70 శాతం వరకు డ్యామేజ్ ని క్లెయిమ్ చేయచ్చు. ప్రతి చిన్న ప్రమాదానికి, చిన్న డ్యామేజ్ కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకండి. ఎందుకంటే అలా చేస్తే మీ కారు విలువ తగ్గిపోతుంది.