వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో విరుచుకుపడుతున్నాడు. భారీ వర్షాల ధాటికి చెరువులు, వాగులు ఉప్పొంగుతూ వరదలు సంబవిస్తున్నాయి. వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటున్నాయి
దేశ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జన జీవనం స్థంబించిపోయింది. ఒకదాని వెంట మరో అల్పపీడనాలు ఏర్పడడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో వరదలు సంబవిస్తున్నాయి. వరదల ధాటికి పురాతన భవనాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. వాహనాలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. ప్రజలు నివాసాలు కోల్పోయి మంచి నీరు, ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఉత్తర భారతంలో కురుస్తున్న వర్షాలు దేశ రాజధాని ఢిల్లీలో భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. అతిగా కురుస్తున్న వర్షాలతో యమునా నది మహోగ్ర రూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో నోయిడాలో పదుల సంఖ్యలో కార్లు నీట మునిగిన ఘటన చోటుచేసుకుంది.
యమునా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఢిల్లీ సహా సమీప ప్రాంతాలన్నీ జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రజలు వరదల ధాటికి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. నిరాశ్రయులైన వరద బాధితులకు సహాయక చర్యలు అందించడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే నోయిడాలోని ఎకోటెక్ -3 ప్రాంతంలో విపరీతంగా వచ్చిన వరద నీటితో అక్కడ పార్కింగ్ చేసిన కార్లు నీట మునిగాయి. పదుల సంఖ్యలో కార్లు ఐదడుగుల నీటిలో మునిగిపోయి బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. దీంతో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం యమునా నది మహోగ్రరూపం దాల్చడంతో వరద నీరు తాజ్ మహల్ ను తాకిన విషయం తెలిసిందే.