గత కొంత కాలంగా ఉద్యోగాల తొలగింపు గురించే వార్తలు వింటున్నాం. భారీ టెక్ దిగ్గజాలు మొదలు.. చిన్న చిన్న కంపెనీల వరకు చాలా చోట్ల ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో అర్థం కాని పరిస్థితులు. ఈ క్రమంలో తాజాగా ఓ రంగంలో భారీ ఖాళీలున్నట్లు.. వేతనం కూడా 45 లక్షల వరకు అందుకోవచ్చంటూ నివేదక ఒకటి విడుదలయ్యింది. ఆ వివరాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగి పోతుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. చాట్‌జీపీటీ లాంచ్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మరింత ఎక్కువగా చర్చ జరిగింది. రానున్న కాలమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే అంటున్నారు టెక్ నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ బూమ్ పెరుగుతోంది. దీనికి తగ్గట్లే ఉద్యోగ అవకాశాలు కూడా పెరగనున్నాయి. మన దేశంలోనూ ఏఐ బూమ్ పెరగనుంది. దీని ద్వారా యువతకు మంచి ఉపాధి అవకాశాలు రాబోతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం డేటా సైంటిస్టులు, మెషన్ లర్నింగ్ ఇంజినీర్లు వంటి ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉందని.. ఈ రంగాల్లో సుమారు 45,000 వరకు ఉద్యోగాలు ఉన్నాయని తెలిపింది. ఈ నివేదికను టెక్ స్టాఫింక్ కంపెనీ టీమ్‌లీస్ డిజిటల్ రూపొందించింది.
ఈ నివేదిక ప్రస్తుతం భారత్‌లో ఆర్టిఫిషియల్ ప్రొఫెషనల్స్‌కి డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. భవిష్యత్తులోనూ ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ప్రధానంగా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, స్కేలబుల్ మెషిన్ లెర్నింగ్ మోడల్ డెవలపింగ్ స్కిల్స్ ఉన్న వారికి ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో డేటా సైంటిస్ట్, మెషన్ లర్నింగ్ ఇంజనీర్లలకు వార్షిక వేతనం రూ.14 లక్షలు, అలానే డేటా ఆర్కిటెక్ట్స్ ఏడాదికి గరిష్ఠంగా రూ.12 లక్షల వరకు ప్యాకేజీ పొందేందుకు అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
అలానే పైన చెప్పిన విభాగాల్లో 8 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న వారు అధిక శాలరీ ప్యాకేజీలు పొందేందుకు అవకాశం ఉందని.. అది కూడా గరిష్టంగా రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు అందుకోవచ్చని పేర్కొంది. దేశంలోని 37 శాతం కంపెనీలు ఏఐ రెడీ వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేసేందుకుగాను.. ఏఐ లర్నింగ్ కార్యక్రమాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇక 30 శాతం కంపెనీలు.. తమ సిబ్బందిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఏఐ లర్నింగ్ అనేది తప్పనిసరిగా అవసరమవుతుందని భావిస్తుండగా.. మరో 56 శాతం కంపెనీలు ఏఐ డిమాండ్-సప్లై గ్యాప్ మధ్య బ్రిడ్జ్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఈ నివేదికలోని అంశాలను పరిశీలిస్తే.. భారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ పెరుగుతోందని స్పష్టంగా అర్థం అవుతోంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు.. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారు సైతం ఏఐ స్కిల్స్‌ను నేర్చుకోవడం వల్ల.. ఈ పోటీ ప్రపంచంలో అందరికన్నా ముందు ఉండగలరని తెలిపింది. కొంత కాలంగా ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హాట్ టాపిక్‌గా మారింది. చాట్‌జీపీటీని మార్కెట్లోకి లాంచ్ చేసిన తర్వాత దానిపై మరింత ఆసక్తి పెరిగింది.
చాట్‌జీపీటీని లాంచ్ చేసిన రెండు నెలల్లోనే 100 మిలియన్ యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. ఈ మైలురాయిని చేరుకునేందుకు టిక్‌టాక్‌కు 9 నెలలు పడితే, ఇన్‌స్టాగ్రామ్‌కి రెండేళ్ల సమయం పట్టింది. అయితే, చాట్‌జీపీటీకి కేవలం రెండు నెలలే పట్టడంతో.. ఆ టెక్నాలజీ ఏ స్థాయిలో దూసుకొస్తుందో అర్థం అవుతోంది. మరి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు ఈ రంగంపై దృష్టి పెడితే బెటర్ అంటున్నారు టెక్ నిపుణులు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లాభాలుంటాయా.. నష్టాలంఉటాయా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.