క్రికెట్‌ను అభిమానించే ఎందరికో మహేంద్ర సింగ్ ధోని ఫేవరెట్ క్రికెటర్. అంతెందుకు చాలా మంది క్రికెటర్లు అతడ్ని ఆరాధిస్తారు. అలాంటి ధోని పేరును బ్యాట్ పైకి రాసుకుని గ్రౌండ్లోకి దిగిందో బ్యాటర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మహిళల ఐపీఎల్ మొదలైపోయింది. తొలి సీజన్ మొదటి రెండు మ్యాచులు ఏకపక్షంగా సాగడంతో అభిమానులు కాస్త బోర్‌గా ఫీలయ్యారు. అయితే ఆదివారం రాత్రి గుజరాత్ జెయంట్స్ – యూపీ వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం మస్తు వినోదాన్ని పంచింది. అసలైన టీ20 మజా ఎలా ఉంటుందో చూపించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో యూపీ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టులో హర్లీన్ డియోల్ (32 బాల్స్‌లో 46) ఇన్నింగ్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆష్లే గార్డెనర్ (25), సబ్బినేని (మేఘన 24) డియోల్‌కు మంచి సహకారాన్ని అందించారు. దీంతో ఆ జట్టు 169 రన్స్ చేసింది.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ జట్టులో గ్రేస్ హ్యారిస్ (26 బాల్స్‌లో 59 నాటౌట్), సోఫీ ఎక్లెస్టోన్ (12 బాల్స్‌లో 22) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు. మరో బాల్ మిగిలుండగానే యూపీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు బ్యాటింగ్‌లో వికెట్లు పడుతున్నా ఓపిగ్గా ఆడిన కిరణ్ నవ్‌గిరే (43 బాల్స్‌లో 53) ఇన్నింగ్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఇక, ఈ మ్యాచ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ క్రికెట్ వరల్డ్‌ను ఆకర్షించింది. టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని పేరును బ్యాట్‌పై రాసుకుని బరిలోకి దిగింది కిరణ్ నవ్‌గిరే. మహీ వీరాభిమాని అయిన ఆమె.. స్పాన్సర్ ఎవరూ లేకపోవడంతో ఇలా చేసింది. ఎంఎస్డీ 07 అని రాసి ఉన్న బ్యాట్‌తో బరిలోకి దిగి హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించింది కిరణ్. ధోని ఫ్యాన్స్ ఆమెను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. ధోని పుణ్యమా అని క్రికెట్ ఫ్యాన్స్ నోళ్లలో ఆమె పేరు నానుతోంది.
Kiran Navgire wrote MS Dhoni’s name on the bat before smashing a fifty for @UPWarriorz in #WPL
Following MSD’s footsteps 🌟
📸: Jio Cinema pic.twitter.com/GAAhIBX44y
— CricTracker (@Cricketracker) March 5, 2023