వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్.. పొట్టి ఫార్మాట్‌లోని నిజమైన కిక్‌ని మరోసారి పరిచయం చేసింది. 5 మ్యాచుల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ అలవోకగా విజయం సాధించినప్పటికీ.. రెండో టీ20 మాత్రం ఆఖరి బంతి వరకు సాగింది.ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని కోల్పోయింది ఆతిథ్య జట్టు వెస్టిండీస్.
మొదట టాస్ గెలిచిన వెస్టిండీస్ ఇంగ్లాండ్‌కి బ్యాటింగ్ అప్పగించింది. టామ్ బాంటన్ (25), జాసన్ రాయ్ (45), మొయిన్ ఆలీ (31) పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కి ఆశించిన శుభారంభం లభించలేదు. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ ని నికోలస్ పూరన్ (24), డారెన్ బ్రావో (23) పరుగులు చేసి కాసేపు ఆదుకున్నప్పటికీ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో 15.1 ఓవర్లలోనే 98 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి, విజయంపై ఆశలు కోల్పోయింది వెస్టిండీస్.
అయితే రొమరియో షెఫార్డ్, అకీల్ హుస్సేన్ జంట అద్భుతంగా పోరాడారు. 18వ ఓవర్లో 23 పరుగులు రాబట్టిన ఈ జంట, 19వ ఓవర్లో 8 పరుగులు రాబట్టారు. దీంతో ఆఖరి ఓవర్‌లో విండీస్ విజయానికి 30 పరుగులు కావాల్సి వచ్చింది. 20వ ఓవర్లో 2 పరుగులు వైడ్స్ రూపంలో రాగా.. 2 ఫోర్లు,3 సిక్సర్లు బాదాడు అకీల్ హుస్సేన్. చివరికి 28 పరుగులు మాత్రమే రావడంతో ఒకే ఒక్క పరుగు తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది వెస్టిండీస్.
ఆఖర్లో రొమరియో షెఫార్డ్ 28 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 44 పరుగులు చేయగా, అకీల్ హుస్సేన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరూ 9వ వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఒక్క పరుగు తేడాతో టీ20 మ్యాచులు ఓడిపోవడం వెస్టిండీస్‌కి ఇది మూడోసారి.