టీమిండియా జట్టు గత కొద్ది రోజులుగా రెస్ట్ లేకుండా మ్యాచ్ లు ఆడుతోంది. అక్టోబర్- నవంబర్ లో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వరకూ జట్టుకు రెస్ట్ లేకుండా షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లకు సీనియర్లలో కొంతమందికి బీసీసీఐ రెస్ట్ ఇవ్వడం లేదా వాళ్లే తమకు విశ్రాంతి కావాలని కోరుతూ ఉండటం చూస్తున్నాం. ఇలాంటి వాతావరణంపై టీమిండియా వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ సీనియర్లు, బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “అంతర్జాతీయ మ్యాచ్‌లకు రెస్ట్ కోరడాన్ని నేను అస్సలు సమర్థించను. వీళ్లంతా ఐపీఎల్ లీగ్ అప్పుడు విశ్రాంతి కోరరు.. కానీ, టీమిండియా మ్యాచ్ లు అనగానే రెస్ట్ కావాలంటారు. మీరు ఇండియాకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు విశ్రాంతి గురించి మాట్లాడకండి.”
“టీ20ల్లో కేవలం 20 ఓవర్లలో మాత్రమే ఆడతారు. టెస్టు క్రికెట్ విషయం వేరు.. టెస్టులో మైండి, బాడీపై ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. 20 ఓవర్ల ఆటలో మీ శరీరంపై ఏమాత్రం భారం పడుతుంది? క్రీడాకారులకు విశ్రాంతి కల్పించే అంశంపై అటు బీసీసీఐ కూడా పునరాలోచన చేయాలి. గ్రేడ్ ఏ కాంట్రాక్టు ద్వారా ప్లేయర్లుకు ప్రతి మ్యాచ్ కు వేతనం, సౌకర్యాలు లభిస్తున్నాయి. తరచూ విశ్రాంతి కోరే ప్లేయర్లను కాంట్రాక్ట్ ఏ నుంచి డిమోడ్ చేయాలి.”
“ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్ ల నుంచి తరచూ విశ్రాంతి కోరుతూ ఉంటే వారికి అందే ప్రయోజనాలను కూడా తగ్గించండి. బీసీసీఐ ఈ విషయంలో ఇంకాస్త ప్రొఫెషనల్ గా వ్యవహరించాల్సి ఉంది. కానీ, టీమిండియా తరఫున ఆడేందుకు.. నేను ఆడను అని ఎలా చెప్తారు? అందుకే నేను ఈ విధానాన్ని సమర్థించను” అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.
బీసీసీఐ గత కొద్ది నెలలుగా కొన్ని సిరీస్ లకు కొందరు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతినిస్తూ వస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్డ్ టెస్టు పూర్తయ్యాక టీ20 సిరీస్ ఫస్ట్ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలపైనే సునీల్ గవాస్కర్ తనదైనశైలిలో స్పందించారు. సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.