సాధారణంగా క్రికెటర్ల పెళ్లి అంటే అంగరంగ వైభవంగా, సందడి సందడిగా జరుగుతుంది. ఇక ఈ వేడుకకు సినీ, క్రికెటర్లు చాలామంది వస్తారు. ఇలా కాదు అంటే.. కోహ్లీలా కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ తనకు వద్దనుకుందో ఏమో గానీ టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ వేదా కృష్ణమూర్తి మాత్రం సింపుల్ గా పెళ్లి చేసుకుంది. ఎన్నాళ్ల నుంచో రిలేషన్ లో ఉన్న తన ప్రియుడిని కోర్టులో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోల్ని కొత్త జంట ఇద్దరూ తమ తమ ఇన్ స్టా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇక వీళ్లకు సహ క్రికెటర్లందరూ కూడా విషెస్ చెబుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన వేదా కృష్ణమూర్తి ఆల్ రౌండర్. 2011లో టీమిండియాలోకి వచ్చిన ఆమె.. ఇప్పటికీ స్టార్ ప్లేయర్ గా కొనసాగుతోంది. ఇక కెరీర్ పరంగా బిజీగా ఉన్న వేదా.. తన రాష్ట్రానికే చెందిన అర్జున్ తో ప్రేమలో పడింది. గతేడాది సెప్టెంబరు 11న మోకాళ్లపై నిల్చుని అర్జున్ ప్రపోజ్ చేశాడు. ఈ ఫొటోల్ని వేదా, తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అప్పట్లో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఆ ఫొటోలని కూడా ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇక వీరి రిలేషన్ గురించి క్రికెటర్లలో చాలామందికి తెలుసు. అందుకు తగ్గట్లే ఈ ఇద్దరూ కూడా గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారేమోనని అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా సింపుల్ గా తన తల్లి పుట్టినరోజున అంటే జనవరి 12న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది.
‘మిస్టర్ అండ్ మిసెస్!!! ఇది నీ కోసమే అమ్మా. ఈ రోజు ఎప్పుడూ ప్రత్యేకం. లవ్ యూ అక్కా ఇప్పుడు పెళ్లయింది’ అని వేదా తన పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ క్యాప్షన్ జోడించింది. ఇక కరోనా సెకండ్ వేవ్ టైంలో వేద అమ్మ, అక్క వైరస్ సోకి మరణించారు. మరోవైపు పెళ్లి ఫొటోలు షేర్ చేసిన అర్జున్.. ‘కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాం’ అని పోస్ట్ పెట్టాడు. ఇదిలా ఉండగా.. వేదా టీమిండియాకు ఆడుతుండగా.. 33 ఏళ్ల అర్జున్ కర్ణాటక తరఫున ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. కానీ కర్ణాటక ప్రీమియర్ లీగ్ మాత్రం ఆడుతున్నాడు. అతడు 2019లో ఈ లీగ్ లో తన చివరి మ్యాచ్ ఆడాడు. 2016లో మహారాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున మనం చెప్పుకొన్న ఒక్క మ్యాచ్ ఆడాడు.