టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో టీమిండియా నిరాశపర్చింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. కాగా ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా హెచ్ కోచ్ రవిశాస్త్రి నిద్రపోతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టు ప్రదర్శన ఆందోళన కరంగా ఉన్న సమయంలో కోచ్ ఇలా కునుకు తీయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
గతంలో కోచ్‌గా అనేక విజయాలు అందించిన రవిశాస్త్రి ప్రస్తుతం టీమిండియా ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత నెల 24న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత్ ఆదివారం న్యూజిల్యాండ్‌తో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏ దశలోనూ సమర్థంగా బ్యాటింగ్ చేయలేదు. ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ నిరాశ పరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్ శర్మ, ఆ తర్వాత వచ్చిన కోహ్లీ భారీ షాట్లు ఆడే క్రమంలో క్యాచ్‌లు ఇచ్చి వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో టీమిండియా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది.
ఇలాంటి పరిస్థితిల్లో హెడ్ కోచ్‌గా ఉన్న శాస్త్రి ఆటగాళ్లకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం మానేసి తాపిగా కునుకు తీయడంతో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా కోచ్‌గా శాస్త్రికి ఇదే చివరి టోర్నీ. ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత కోచ్‌గా రవిశాస్త్రి గడువు ముగుస్తుంది. టీమిండియాకు కొత్త కోచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మరి రవిశాస్త్రి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలా నిద్రలోకి జారుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.