గతేడాది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేత అయిన చెన్నై జట్టు ఈరకమైన పెర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశకు గురయ్యారు. కానీ ఈ ఏడాది చెన్నై జట్టు చెలరేగుతోంది.
ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై.. ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవడం సులువనే చెప్పొచ్చు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచులో విజయం సాధిస్తే సీఎస్కే ప్లేఆఫ్స్ బెర్త్ పక్కా దాదాపు ఖాయం కావడం తథ్యం. ఈ నేపథ్యంలో ధోని సారథ్యంలోని సీఎస్కే ప్రదర్శన గురించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువకులతో కూడిన సీఎస్కే బౌలింగ్ విభాగం అద్భుతాలు సృష్టిస్తోందని రవిశాస్త్రి మెచ్చుకున్నాడు. గత సీజన్లో ఫెయిలైన ప్లేయర్ల నుంచి ఈ సీజన్లో మంచి ప్రదర్శనలు రాబట్టడం ప్రశంసనీయమని.. ఇదే ధోని ప్రత్యేకత అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ధోనీది మాస్టర్ మైండ్ అని అని ప్రశంసించాడు.
టీమ్‌ను బలోపేతం చేయడంలో ధోని సిద్ధహస్తుడని.. యువకుల్లో ఆత్మవిశ్వాసం నింపి ఛాన్సులు ఇస్తూ ఫలితాలను సాధిస్తున్నాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు. చెన్న సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్తే మాత్రం మరింత డేంజరస్‌గా మారుతుందన్నాడు. ప్లేఆఫ్స్‌లో రెండు మ్యాచ్‌లు చెన్నై వేదికగానే జరుగుతాయని.. కాబట్టి హోమ్ గ్రౌండ్లో సీఎస్కేను అడ్డుకోవడం అంత ఈజీ కాదన్నాడు రవిశాస్త్రి. చెన్నై టీమ్‌లో ఎవరికైనా గాయాలైతే తప్ప.. ప్లేయర్లంతా ప్రస్తుతానికి సరైన మార్గంలో ఉన్నారని రవిశాస్త్రి తెలిపాడు. ఇకపోతే, సీఎస్కే 11 మ్యాచుల్లో ఆరు విజయాలు, నాలుగు ఓటములు, ఒక మ్యాచ్ రద్దవడంతో 13 పాయింట్లతో రెండో ప్లేసులో కొనసాగుతోంది. చివరి మూడు మ్యాచుల్లో కనీసం రెండింట్లో నెగ్గినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. మిగిలిన మూడు మ్యాచుల్లో ఢిల్లీతో రెండు సార్లు, కేకేఆర్‌తో ఒకసారి తలపడనుంది.