రహానే ఫామ్ పై విమర్శలు, పెదవి విరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు రహానేకు మద్దతు కూడా లభిస్తూనే ఉంది. ఈ ఏడాది టెస్టు క్రికెట్ లో 19.57 సగటుతో కేవలం 411 పరుగులు మాత్రమే చేయడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. దక్షిణాఫ్రికా టూర్ కు రహానే సెలక్ట్ అయినా కూడా తుది జట్టులో చోటు దక్కించుకోవడం అత్యంత కష్టమనే చెప్పాలి. శ్రేయస్ అయ్యార్, విహారి రూపంలో రహానే చోటుకు ముప్పు ఉందనే చెప్పాలి. రహానే విషయంలో తాజాగా టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు.
‘గణాంకాల ప్రాతిపదికన జట్టును ఎంపిక చేస్తే కోహ్లీకి కూడా స్థానం దక్కదు కదా? కోహ్లీ కూడా గతేడాది సరైన ఫామ్ లో లేడు. జట్టులో ఐదో స్థానానికి గట్టి పోటీ నెలకొంది. కోహ్లీ ఫామ్ లో లేడని తప్పిస్తారా? పుజారా ఫామ్ గురించి ఎవరూ మాట్లాడరు. చివరికి మిగిలేది రహానే మాత్రమే. రానున్న రోజుల్లో రహానే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో ఐదుగురు బ్యాటర్స్ తో దిగితే రహానేకి చోటు దక్కడం కష్టమే. కోహ్లీకి ఇది కొత్తేం కాదు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం బాగా తెలుసు.
ఈసారి కూడా కోహ్లీ రాణిస్తాడని భావిస్తున్నా. రహానే స్థానంలో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారీకి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి’ అంటూ ఆశిష్ నెహ్రా తన మనసులోని మాటను బయట పెట్టాడు. అయితే అతని మాటల్లో రహానేకే మద్దతు తెలిపుతున్నట్లు చెప్పకనే చెప్పాడు. దక్షిణాఫ్రికాపై తుది జట్టులో రహానేకు చోటు దక్కుతుందా?