ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా అజింక్య రహానే తన క్లాస్ షోని చూపించాడు. ఈ క్రమంలోనే అజింక్యా రహానే ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు ఆసీస్ ఆధిపత్యం కొనసాగిన ఈ టెస్ట్ లో.. మూడో రోజు మాత్రం టీమిండియా పోరాటం కొనసాగుతోంది. 151 నిర్ణిత స్కోర్ వద్ద మూడో రోజు ఆటని మొదలు పెట్టిన ఇండియాకి ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. ఒక్క పరుగు కూడా అదనంగా జోడించకుండానే కీపర్ భరత్ క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. దీంతో.. ఇండియా 200 మార్క్ దాటడం కూడా కష్టమే అనిపించింది. కానీ.. ఇక్కడ నుండే అజింక్యా రహానే క్లాస్ షో మొదలైంది. శార్దూల్ ఠాకూర్ తో కలిసి మళ్ళీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతని రహానే తన భుజాలపై వేసుకున్నాడు.
ఆసీస్ ఫాస్ట్ బౌలర్స్.. స్వింగ్, బౌన్స్ తో బెంబేలెత్తిస్తున్నా రహానే మాత్రమే సహనం కోల్పోకుండా క్రీజ్ లో పాతుకుని పోయాడు. మరోవైపు శార్దూల్ నుండి కూడా మంచి సహకారం లభించడంతో స్కోర్ బోర్డు నెమ్మదిగా పెరుగుతూ పోయింది. ఈ క్రమంలోనే రహానే.. ఓ ఫోర్, సిక్స్ బాది.. 92 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. టెస్టుల్లో రహానేకి ఇది 26వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే అజింక్యా రహానే ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ తరుపున తొలి హాఫ్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ గా రహానే నిలిచాడు. నిజానికి టీమిండియా 2021లో కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడింది. కానీ.. ఆ మ్యాచ్ లో ఏ భారత ఆటగాడు కూడా కనీసం అర్ధ శతకం చేయలేకపోయారు. ఆ మ్యాచ్ లో కూడా రహానే 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇలా.. హాఫ్ సెంచరీ సాధించడం మాత్రమే కాదు.. టెస్ట్ లో భారత్ తరుపున 5000 వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల సరసన కూడా రహానే చోటు దక్కించుకున్నాడు.
నిజానికి దాదాపు 512 రోజుల తర్వాత టెస్ట్ జట్టులోకి వచ్చాడు రహానే. ఐపీఎల్ అతని కమ్ బ్యాక్ కి బాగా ఉపయోగపడింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా రహానే అదే ఫామ్ ని కంటిన్యూ చేయడంతో భారత్ పోటీ ఇచ్చే స్థితిలో నిలిచింది. మూడోరోజు తొలి సెషన్ ఆట ముగిసే సమయానికి ఇండియా 6 వికెట్స్ నష్టానికి 260 పరుగులు సాధించి పోరాడుతోంది. ఇప్పటికీ 209 పరుగులు వెనుకపడి ఉన్నా.. రహానే 89 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 36 పరుగులతో క్రీజ్ లో ఉండటం సానుకూలంగా కనిపిస్తోంది. మరి.. కీలకమైన మ్యాచ్ అద్భుతమైన ఆట తీరు కనపరుస్తున్న రహానే పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.