ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్- 2022 విషయంలో అందరికంటే ఎక్కువగా టీమిండియా ఫ్యాన్సే బాధపడుతున్నారు. కచ్చితంగా ఫైనల్స్ చేరుతాం.. ఈసారి కప్ కొడతాం అని ఎంతో విశ్వాసంగా ఉన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన టీమిండియా.. రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో అతి దారుణంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు చేతులెత్తేశారు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మ్యాచ్ గెలవండని కోరుకునే స్థితి నుంచి ఒక్క వికెట్ అయినా పడగొట్టండని కోరుకునే దాకా వెళ్లింది ఆ మ్యాచ్. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియాలో చాలా మందిని ట్రోల్ చేశారు. కానీ, టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచి కేఎల్ రాహుల్‌ని ట్రోల్ చేయని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో.
ఈ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ ప్రారంభం నుంచి కేఎల్ రాహుల్ అతి పేలవ ప్రదర్శనతో అందరినీ నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా వచ్చి బాల్‌ని టచ్ చేయడానికి కూడా భయపడుతూ కనిపించాడు. జింబాంబ్వే, బంగ్లాదేశ్ జట్లపై మాత్రమే అర్ధ శతకాలు నమోదు చేశాడు. సెమీ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో మాత్రం కేవలం 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అసలు కేఎల్ రాహుల్‌కి ఎందుకు అవకాశం కల్పిస్తున్నారంటూ బీసీసీఐ, రాహుల్ ద్రవిడ్ లాంటివారిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ టోర్నమెంట్ మొత్తంలో కేఎల్ రాహుల్ ఒక్కడే అంత ట్రోలింగ్‌కి గురయ్యాడు. ఇప్పుడు మరోసారి నెట్టింట రాహుల్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.
కేఎల్ రాహుల్ తన ప్రేయసితో కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. టీమిండియా మొత్తం సెమీస్‌కి రెండ్రోజుల ముందు అడిలైడ్‌లోని బ్రిటిష్ రాజ్ రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్లింది. కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి అందరూ సంతోషంగా గడిపారు. అయితే కేఎల్ రాహుల్- అతియా శెట్టిని తదేకంగా చూస్తున్న పిక్ అనమాట అది. అతని ఆటకు ముడిపెడుతూ ఇలా ప్రేయసిని చూసుకుంటూ కాలం గడిపేస్తే.. ఇంక గేమ్ మీద ఫోకస్ ఏముంటుంది అని కామెంట్ చేస్తున్నారు. గేమ్ సంగతి పక్కన పెట్టి ఇంక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఏదేమైనా కేఎల్ రాహుల్ తన ఆటతీరు మార్చుకోకపోతే జట్టులో కొనసాగడం కష్టమనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.