టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ జరిగి మూడు రోజులు అవుతోంది. కానీ ఆ మ్యాచ్ ప్రభావం ఇంకా జనాల్లోంచి పోలేదనే చెప్పాలి. తాజాగా మరో సారి ఈ మ్యాచ్ వార్తల్లో నిలిచింది. దానికి కారణం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. సొంత దేశ ఆటగాళ్లపైనే విమర్శలు గుప్పించాడు. టీమిండియాతో మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు ఆట పై శ్రద్ద పెట్టలేదని, వారికి క్రికెట్ రూల్స్ కూడా పూర్తిగా తెలియదని ఫైర్ అయ్యాడు. అదీ కాక పాక్ సెలక్షన్ కమిటీ కూడా కొన్ని కీలక అంశాలను విస్మరించిందని సల్మాన్ భట్ ఎద్దేవ చేశాడు. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మ్యాచ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను పంచుకున్నాడు.
“క్రికెట్ గ్రౌండ్ లో ‘ప్రజన్స్ ఆఫ్ మైండ్’ చాలా ముఖ్యం. భారత్-పాక్ మ్యాచ్ లో అది టీమిండియా ఆటగాళ్లు ఎంతో చక్కగా చూపించారంటూ.. కోహ్లీని, దినేశ్ కార్తీక్ ను ప్రశంసించాడు సల్మాన్ భట్. మరిన్ని విషయాల గురించి సల్మాన్ భట్ మాట్లాడుతూ..”నో బాల్ వివాదంలో.. బంతి బ్యాట్ కు తాకే సమయంలో, బ్యాటర్ నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉంటే కచ్చితంగా అది నో బాలే అవుతుంది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ 4వ బంతి కచ్చితంగా నో బాలే. అదే బంతికి వికెట్ పడితే అది నో బాలా? కాదా? అనే విషయంపై థర్డ్ అంపైర్ కు వెళ్లోచ్చు. ఈ మ్యాచ్ లో కోహ్లీ, దినేశ్ కార్తీక్ ప్రజన్స్ ఆఫ్ మైండ్ సెట్ అద్భుతం. బాల్ వికెట్లను తాకి థర్డ్ మ్యాన్ వైపు వెళ్లినప్పుడు వారిద్దరు మూడు పరుగులు తీశారు. ఇది పాక్ ఆటగాళ్లకు అర్దం కాలేదు” అని సల్మాన్ భట్ వారిని ఎద్దేవచేశాడు.
ఈ మ్యాచ్ పై భట్ మరింతగా స్పందిస్తూ.. “దురదృష్టవశాత్తు పాక్ ప్లేయర్స్ కు ఆటపై అవగాహన లేదు. వారు ఆటపై బుర్రపెట్టలేదనే అర్దం అవుతోంది. వరల్డ్ వైడ్ గా క్రికెట్ లీగ్స్ ఆడే పాక్ ఆటగాళ్లకు నిబంధనలు తెలియకపోవడం విచారకరం. క్రికెట్ చట్టాలు, నిబంధనలు వారికి కచ్చితంగా తెలిసి ఉండాలి. అవి తెలియకుండా అంపైర్లతో వాగ్వాదానికి దిగటం శోచనీయం. పాక్ ఆటగాళ్లు ఇప్పటికైనా క్రికెట్ చట్టాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలి” అని సల్మాన్ భట్ సూచించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆటను ఎంత పొగిడినా తక్కువే అంటూ భట్ కితాబిచ్చాడు. ఈ ప్రపంచ కప్ లో బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని, వరల్డ్ క్లాస్ బ్యాటర్లను క్రీజ్ లో కుదురుకోకుండా చేస్తున్నారని తెలిపాడు. మీ హక్కుల కోసం మాట్లాడేటప్పుడు, మీరు ఎక్కడ ఉన్నరో తెలుసుకుని మాట్లాడాలని భట్ పేర్కొన్నాడు. సల్మాన్ భట్ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ బోర్డులో తీవ్ర దూమారాన్నే లేపేలా ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.