ప్రపంచంలోనే గొప్ప బౌలర్ గా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ సైతం.. సెహ్వాగ్ ను మించిన విధ్వంసక బ్యాటర్ ను చూడలేదు అంటుంటే.. నవీద్ మాత్రం వీరూను ఔట్ చేయడం పెద్ద విషయం కాదని తన అక్కసు వెళ్లగక్కాడు.
మరో మూడు నెలల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తమ నోటికి పని ప్రారంభించారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇరు దేశాలు ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. ఈ క్రమంలో రానున్న మూడు నెలల్లో పాకిస్థాన్ జట్టుతో టీమిండియా ఆసియాకప్, ప్రపంచకప్ లలో అమీతుమీ తేల్చుకోనుంది. దాయాదుల పోరు కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. ఒకప్పుడు భారత డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేతిలో చావు దెబ్బ తిన్న పాక్ మాజీ పేసర్ రాణా నవీద్ ఉల్ హసన్ అవాకులు చవాకులు పేలుతున్నాడు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు నవీద్.. వీరూ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ప్రపంచంలోనే గొప్ప బౌలర్ గా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ సైతం.. సెహ్వాగ్ ను మించిన విధ్వంసక బ్యాటర్ ను చూడలేదు అంటుంటే.. నవీద్ మాత్రం వీరూను ఔట్ చేయడం పెద్ద విషయం కాదని తన అక్కసు వెళ్లగక్కాడు. పాక్ బౌలర్లలో అందరికంటే ఎక్కువ సెహ్వాగ్ ధాటికి గురైన నవీద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా మారింది. టీమిండియా 2004లో పాకిస్థాన్ లో పర్యటించింది. ఈ టూర్ లో భాగంగా కరాచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో మన వీరేంద్రుడు.. నవీద్ కు చుక్కలు చూపాడు. సెహ్వాగ్ దెబ్బకు నవీద్ సొంత ప్రేక్షకులకే ముఖం చూపెట్టుకోలేకపోయాడు. అంతర్జాతీయ కెరీర్ లో పాకిస్థాన్ తరఫున 74 వన్డేలు, 9 టెస్టులు ఆడిన నవీద్ కు ఆ మ్యాచ్ ఒక పీడకలను మిగిల్చింది అనడంలో సందేహమే లేదు.
వన్డే క్రికెట్ లో నోబాల్ కు ఫ్రీ హిట్ లేని కాలంలోనే.. నవీద్ వేసిన రెండు బంతుల్లోనే సెహ్వాగ్ 21 పరుగులు రాబట్టి అదుర్స్ అనిపించుకున్నాడు. 11వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన నవీద్ తొలి బంతిని వీరూ తనదైన స్టైల్లో బౌండ్రీకి తరలించాడు. కాసేపటికే అది నోబాల్ అని అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. తదుపరి బాల్ కు కూడా సెహ్వాగ్ ఫోర్ బాదగా అంపైర్ నోబాల్ గా ప్రకటించాడు. మూడో బంతి కూడా యాక్షన్ రీప్లేలా సాగింది. నవీద్ చేతి నుంచి బంతి విడుదలవడం.. సెహ్వాగ్ దానిపై విరుచుకుపడటం.. అది కవర్స్ దిశగా బౌండ్రీ దాటడం. గీత దాటినందుకు అంపైర్ నోబాల్ గా ప్రకటించడం జరిగిపోయాయి. ఫలితంగా 11వ ఓవర్లో ఒక్క బంతి కూడా పూర్తి కాకముందే.. వీరూ జట్టు కోసం 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత నవీద్ వేసిన లీగల్ బంతి డాట్ కాగా.. మరుసటి బంతిని సెహ్వాగ్ తిరిగి బౌండ్రీకి పంపాడు. అది కూడా నోబాల్ గా తేలింది. ఇలా ఏకంగా ఒకే ఓవర్ లో తన టెంపరితనంతో 24 పరుగులు సమర్పించుకున్న నవీద్.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరూ ను ఔట్ చేయడం పెద్ద కష్టం కాదు అనడంపై సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి. సెహ్వాగ్ రెండు బంతుల్లోనే 21 పరుగులు చేసినప్పుడు ఎక్కడ పోయింది.. నీ విశ్లేషణ అంటూ పాక్ బౌలర్ ను సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.