టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ను ఐపీఎల్ 2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీలో చూసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ స్టార్ ఓపెనర్‌ను తమ టీమ్‌లోకి తీసుకునేందుకు సన్‌రైజర్స్ ఓనర్ కావ్య పాప ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత.. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు చాలా మంది ఆటగాళ్లను సన్‌రైజర్స్ వదిలించుకుంది. 10 కోట్లకు పైగా ధరపెట్టి కొన్న కరేబియన్ క్రికెటర్ నికోలస్ పూరన్‌తో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సైతం సన్ రైజర్స్ రిలీజ్ చేసింది. ఇక మరికొన్ని రోజుల్లో జరగబోయే ఐపీఎల్ మినీ వేలం కోసం అన్ని ఫ్రాంచైజ్‌ల కంటే ఎక్కువ డబ్బుతో వేలంలో పాల్గొననుంది ఎస్ఆర్హెచ్.
ఈ వేలంలో కొంతమంది స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సన్‌రైజర్స్.. ఈ సారి టీమిండియా ఆటగాళ్లను తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా విదేశీ ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్న సన్‌రైజర్స్.. ఈ సారి తమ పంథా మార్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మయాంక్ అగర్వాల్‌ను ఎలాగైనా జట్టులోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. చాలా కాలంగా పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న మయాంక్ అగర్వాల్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా అద్భుతంగా రాణించేవాడు.
అయితే.. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత కేఎల్ రాహుల్ పంజాబ్‌ను వీడి.. కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వెళ్లడంతో.. మయాంక్ అగర్వాల్ పంజాబ్‌కు కెప్టెన్ అయ్యాడు. కానీ.. ఆశించిన స్థాయిలో జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. దీంతో ఐపీఎల్ 2023కు మయాంక్‌ను పంజాబ్ రిలీజ్ చేసింది. దీంతో అతను మినీ వేలంలో అందుబాటులో ఉండనున్నాడు. మయాంక్ స్థానంలో పంజాబ్ తమ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను నియమించింది. అయితే.. మయాంక్‌ను తీసుకోవడం ద్వారా.. ఓపెనర్‌గా ఆడించడంతో పాటు అవసరమైతే కెప్టెన్సీ బాధ్యతలు సైతం అప్పగించవచ్చని సన్‌రైజర్స్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. కర్నాటక స్టేట్ టీమ్‌కు, అలాగే పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం మయాంక్‌కు ఉంది. మరి అతన్ని ఎస్ఆర్హెచ్లోకి తీసుకుంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Irfan Pathan said SRH will look for Mayank Agarwal in IPL mini auction because they need an aggressive opener.#IPL2023Auction #IPLAuction pic.twitter.com/fmFbMO8zay
— FAIZ FAZEL (@theFaizFazel) December 20, 2022