తొలి రెండు టెస్టుల్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడినా ఆస్ట్రేలియా మూడో టెస్టులో పులిలా మారి ఘాండ్రిస్తోంది. తొలి రెండు టెస్టులకు, ఈ టెస్టుకు ఆ జట్టులో ఏం మారింది. ఇంత మార్పు ఎలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాలుగు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా, భారత పర్యటనకు వచ్చింది. అంతకుముందు జరిగిన బీజీటీ ట్రోఫీల్లో టీమిండియానే విజేతగా నిలవడంతో ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో భారత గడ్డపై అడుగుపెట్టింది. కానీ.. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత స్పిన్ ఎటాక్ ముందు ఆసీస్ బ్యాటర్లు ఏ మాత్రం నిలువలేకపోయారు. అలాగే ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులోనూ ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. తొలి రెండు టెస్టులను టీమిండియా మూడు రోజుల్లోనే ముగించి ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. దెబ్బకు కంగారుల కళ్లు బైర్లు కమ్మాయి. దీంతో మిగిలిన రెండు టెస్టుల్లోనూ కూడా టీమిండియా ఆపడం ఆస్ట్రేలియా తరం కాదని వారి దేశ మాజీ క్రికెటర్లే అభిప్రాయపడ్డారు.
కానీ.. మూడో టెస్టులో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తొలి రెండు టెస్టులను స్పిన్ బలంగా నెగ్గిన టీమిండియా.. మూడో టెస్టులో అదే స్పిన్‌కు కుప్పకూలింది. ఇండోర్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను ఆసీస్ బౌలర్లు 109 పరుగులకే కుప్పకూల్చారు. ఒక్క బ్యాటర్‌ను కూడా 25 పరుగుల మార్క్‌ను దాటనివ్వలేదు. కానీ.. ఇదే పిచ్‌పై తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆస్ట్రేలియాదే అని చెప్పవచ్చు. బ్యాటింగ్ బౌలింగ్‌లో వారే డామినేషన్ చేశారు. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాలో కనిపించిన తడబాటు, ధైర్యం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
కాస్త సింపుల్‌గా చెప్పాలంటే తొలి రెండు టెస్టుల్లో టీమిండియా ముందు పిల్లిలా ఉన్న ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో పులిలా మారింది. దీనికి కారణం ఒకే ఒక్క మార్పు అంటూ క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. అదే కెప్టెన్సీలో మార్పు. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తొలి రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వ్యక్తిగత కారణాలతో మూడో టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా చేసిన అనుభవం స్మిత్‌కు ఉంది. దీంతో.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పరిస్థితి, పిచ్ కండీషన్, టీమిండియా బలాబలాలపై మంచి అవగాహన ఉన్న స్మిత్.. అందుకు తగ్గట్లు టీమ్‌ను మాసికంగా సిద్ధం చేసినట్లు సమాచారం.
పైగా రెండు టెస్టుకు, మూడో టెస్టుకు చాలా గ్యాప్ రావడంతో, స్మిత్ ఈ టైమ్‌ను చాలా బాగా ఉపయోగించుకుని, ఇండియాను ఇండియాలో ఓడించడం పెద్ద విషయం కాదనే మానసిక ధైర్యాన్ని జట్టులో నింపినట్లు తెలుస్తోంది. పైగా ఫీల్డ్‌లో కూడా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్‌ను సెట్ చేయడంలో తన మార్క్‌ను చూపించి ఫలితాలు రాబట్టాడు. జట్టు పరంగా ఎంతమంది హేమాహేమీ ఆటగాళ్లు ఉన్నా.. టీమ్ వరల్డ్ నంబర్ అయినా.. సరైన లీడర్ లేకుంటే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టుల్లో నిరూపించింది. అయితే.. కమ్మిన్స్‌ను కెప్టెన్‌గా తప్పుబట్టడం కంటే.. అతను ఇండియన్ కండీషన్స్‌లో స్మిత్ కంటే మెరుగైన కెప్టెన్ అయితే కాదు. అందుకే ఒక్కసారి కెప్టెన్ మారగానే ఆస్ట్రేలియా ఆటతీరే మారిపోయింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Steve Smith is back!
📸: Disney + Hotstar#CricTracker #SteveSmith #INDvAUS pic.twitter.com/2frGz2LUlb
— CricTracker (@Cricketracker) March 1, 2023