ఫామ్ లేమితో గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న ధావన్ కి ఆసియా గేమ్స్ లో అవకాశం వస్తుందని భావించినా అలా జరగలేదు. తాజాగా ఈ విషయంపై ధావన్ స్పందించాడు.
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కి ప్రస్తుతం ఏమి కలిసి రావడం లేదు. ఫామ్ లేమితో గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న ఈ స్టార్ ఓపెనర్ స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. టెస్టు, టీ 20 జట్టులో ప్లేస్ కోల్పోయిన ఈ స్టార్ ఓపెనర్ వన్డేల్లో మాత్రం నిలకడగా ఆడుతూ తన చోటుకి ఎలాంటి ముప్పు లేదని తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. అయితే న్యూజీలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లో వరుసగా విఫలమైన ధావన్ కి సెలక్టర్లు గట్టిగానే షాకిచ్చారు. కిషాన్, గిల్ లాంటి యంగ్ ప్లేయర్లు రాణించడంతో వన్డేల్లో ధావన్ పై వేటు వేయక తప్పలేదు. అయితే ఆసియా గేమ్స్ 2023 లో భాగంగా ధావన్ ని కెప్టెన్ గా నియమిస్తారని అప్పట్లో బీసీసీఐ గట్టిగానే ప్రయత్నాలు జరిపింది. కానీ గబ్బర్ కి మాత్రం మరోసారి నిరాశే మిగిలింది. ఈ విషయంపై తాజాగా స్పందిస్తూ తనను సెలక్ట్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిందైని చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టోర్నీలో ధావన్ రికార్డ్ చాలా మెరుగ్గా ఉంది. 50 కి పైగా సగటు కలిగిన ఈ వెటరన్ ఓపెనర్ వరల్డ్ కప్ సమయానికి వస్తాడని భావించినా ఆ అవకాశమైతే కనిపించడం లేదు. అయితే వరల్డ్ కప్ లో ప్లేస్ దక్కకపోయినా ఆసియా గేమ్స్ లో తనకు అవకాశం లభిస్తుందని ధావన్ ఆశాభావం వ్యక్తం చేసినట్లుగా తెలిపాడు. “ఆసియా గేమ్స్ లో చోటు దక్కుతుందని భావించాను. కానీ అలా జరగలేదు. ఈ విషయం నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే సెలక్టర్లు భిన్నమైన ఆలోచన కలిగి ఉన్నారని ఆలోచించి అర్ధం చేసుకున్నా. రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ టోర్నీలో యువ ఆటగాళ్లు అదరగొడతారని ఆశిస్తున్నా. జాతీయ జట్టులోకి పునరాగమనం చేయడానికి ఫిట్ గా ఉంటాను”. అని ఈ సందర్భంగా ధావన్ తెలియజేశాడు.
ఇక ఈ ఏడాది ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి చైనా ఆతిధ్యమిస్తుంది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్ టీం ఆడకపోయినా.. తొలిసారి ఈ టోర్నీ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా టీ 20 ఫార్మాట్ లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఇక తాజాగా ఏ టోర్నీకి సంబంధించిన టీమిండియా జట్టుని ఇప్పటికే ప్రకటించేశారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకి గైక్వాడ్ ని సెలక్టర్లు కెప్టెన్ గా నియమించారు. అదే టైంలో టీమిండియా స్వదేశంలో వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. మొత్తానికి అటు వన్డే వరల్డ్ కప్ లో, ఇటు ఆసియా గేమ్స్ లో ధావన్ లేకుండానే టీమిండియా ఆడబోతుంది. మరి ధావన్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.